టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీకాంత్ అయ్యంగర్ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. మైక్ దొరికితే చాలు తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే ఆయన, ఈసారి ఏకంగా ఓటీటీ డిజిటల్ వీక్షకులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సినీ వర్గాల్లో మరియు నెటిజన్లలో తీవ్ర దుమారం రేగుతోంది.
ఇటీవల హైదరాబాద్ వేదికగా జరిగిన 'కికు చిరంజీవి' అనే చిన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న శ్రీకాంత్ అయ్యంగర్.. థియేటర్లకు రాని ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. "చాలామంది సినిమా విడుదల కాగానే థియేటర్లకు రాకుండా ఓటీటీలోకి వచ్చాక చూస్తామని అంటున్నారు. ఇలా అయితే రేపు పెళ్లి, హనీమూన్ కూడా ఆన్‌లైన్‌లోనే చూసుకుంటారా?" అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఓటీటీలో సినిమాలు చూసేవారు అసలు ఆడియెన్సే కాదన్న రీతిలో ఆయన మాట్లాడటం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.
గతంలో కూడా సినిమా రివ్యూయర్లు, సినీ జర్నలిస్టులపై అనుచిత పదజాలంతో విరుచుకుపడి వివాదాల్లో చిక్కుకున్న శ్రీకాంత్ అయ్యంగర్, ఇప్పుడు నేరుగా ప్రేక్షకులను ఉద్దేశించి ఇలా మాట్లాడటంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటీటీ అనేది డిజిటల్ యుగంలో ఒక ప్రముఖ వినోద మాధ్యమంగా మారిన వేళ ఇలాంటి పోలికలు సరికాదని హితవు పలుకుతున్నారు.
ప్రస్తుత రోజుల్లో ప్రేక్షకులు పెద్ద సినిమాలను థియేటర్లలో ఎక్స్‌పీరియన్స్ చేసేందుకు ఇష్టపడుతుండగా, చిన్న సినిమాల్లో కంటెంట్ పవర్ ఉంటేనే థియేటర్లకు వస్తున్నారు. సినిమా కంటెంట్ సరిగా లేనప్పుడు ప్రేక్షకులను నిందించడం ఎంతవరకు న్యాయమని సినీ ప్రియులు ప్రశ్నిస్తున్నారు. ఈ రకమైన వివాదాస్పద వ్యాఖ్యలపై శ్రీకాంత్ అయ్యంగర్ సారీ చెబుతారా లేదా తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటారా అనేది వేచి చూడాలి.






