Home

»

Latest News

అమ్మా.. నువ్వు గర్వపడేలా చేస్తాను.. వైరల్ అవుతున్న జాన్వీ ఎమోషనల్ పోస్ట్!

Feb 25, 2026

భారతీయ సినిమా పుట్టిన నాటి నుంచి ఎంతో మంది నటీమణులు చిత్ర పరిశ్రమకు వచ్చారు. తమ అందచందాలతో, అభినయంతో ప్రేక్షకుల్ని కట్టి పడేశారు. అయితే ఒక్కో హీరోయిన్‌కి ఒక్కో ప్రత్యేకత ఉండేది. అలా భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్న అతిలోక సుందరి శ్రీదేవి. ఏ హీరోయిన్‌కీ లభించని ఆద‌ర‌ణ‌ ఆమె సొంతం. దాదాపు 50 సంవత్సరాల పాటు తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 300కి పైగా సినిమాలో నటించి ఎవరూ అందుకోలేని రికార్డును సొంతం చేసుకున్నారు.

ఏ భాషలో తీసుకున్నా.. ఆమెతో నటించని హీరో లేరంటే అతిశయోక్తి కాదు. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జునల సరసన హీరోయిన్‌గా నటించారు. తండ్రీ కొడుకులతో నటించిన అరుదైన ఘనత ఆమెది. సాధారణ ప్రేక్షకులే కాదు, చిత్ర రంగంలో ఉన్న ఎంతో మందికి శ్రీదేవి ఆరాధ్య దేవత. ఆ తర్వాత వచ్చిన ఎంతో మంది హీరోయిన్లకు ఆమె ఇన్‌స్పిరేషన్‌గా నిలిచారు. భౌతికంగా ఆమె మన మధ్య లేనప్పటికీ లెక్కకు మించి ఆమె చేసిన సినిమాలను ఇప్పటికీ ప్రేక్షకులు చూస్తూ మ‌న‌నం చేసుకుంటున్నారు.

ఫిబ్రవరి 24 శ్రీదేవి వర్థంతి. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెను స్మరించుకుంటున్నారు. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌కి తల్లి అంటే ఎంతో ఇష్టం. కుమార్తెను తనంతటి హీరోయిన్‌ని చెయ్యాలని శ్రీదేవి కలలు కనేవారు. ఆ దిశగానే ఆమెను అన్ని విధాలుగా సిద్ధం చేశారు. ఇప్ప్పుడు జాన్వీ హీరోయిన్‌గా పలు భాషల్లో సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అయితే అవేవీ చూడకుండానే శ్రీదేవి అందరికీ దూరమయ్యారు. 

తన తల్లి వర్థంతి సందర్భంగా సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు జాన్వీ. చిన్నతనంలో తల్లితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ ‘అమ్మా.. నిన్ను తలుచుకోకుండా ఒక్క రోజు కూడా గడవదు. నీ గొంతు, నీ కౌగిలి, నీ ధైర్యం.. ఇవే నన్ను ప్రతి రోజూ నడిపిస్తున్నాయి. ఎక్కడున్నా సరే, నువ్వు గర్వపడేలా చేస్తానని భావిస్తున్నాను. మాటల్లో చెప్పలేనంతగా నిన్ను మిస్ అవుతున్నాను. ఎప్పటికీ నీ చిన్న పాపనే’ అంటూ జాన్వీ కపూర్ పెట్టిన ఎమోషనల్ పోస్ట్ అందర్నీ కదిలించింది. ఆమె పోస్ట్‌కు నెటిజన్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com