Home

»

Latest News

శోభిత కొత్త అవ‌తారం.. కలరిపయట్టు, మల్లఖంబ్‌లో శిక్షణ, ఏం చేయ‌బోతోంది.? 

Oct 28, 2026 12:02PM

సినిమాల్లో కొందరు నటీనటులు గ్లామర్‌ పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంటే.. మరికొందరు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. అయితే ఒక నటిగా తనలోని అసలైన ప్రతిభను బయటకు తీసే పాత్రలు దొరికినప్పుడు ఆ అనుభూతి ప్రత్యేకంగా ఉంటుంది. ప్రస్తుతం అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ కూడా అలాంటి అనుభవాన్నే పొందినట్లు చెబుతోంది. ప్రముఖ దర్శకుడు పా. రంజిత్‌ తెరకెక్కిస్తున్న ‘వెట్టువం’ సినిమాలో తన పాత్ర తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందని, తనలోని అసలైన నటిని బయటకు తీసుకొచ్చిందని ఆమె వెల్లడించింది.

‘వెట్టువం’ తమిళంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ డ్రామా. ఆర్య, దినేష్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పా. రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శోభిత రథి అనే పాత్రలో కనిపించనుంది. ఇప్పటివరకు తాను చేసిన పాత్రలకు భిన్నంగా, చాలా శక్తివంతమైన వ్యక్తిత్వం ఉన్న మహిళగా ఇందులో కనిపించనున్నట్లు ఆమె మాటలను బట్టి తెలుస్తోంది. సాధారణంగా తన పాత్రల్లో పైకి ప్రశాంతంగా కనిపిస్తూ, లోపల ఎన్నో భావాలను దాచుకునే మహిళలను పోషించిన శోభిత.. ఈ సినిమాలో మాత్రం చాలా స్వేచ్ఛగా, ధైర్యంగా తన భావాలను వ్యక్తపరిచే పాత్రను చేయడం విశేషం.

ఈ పాత్ర కోసం శోభిత మల్లఖంబ్‌, కలరిపయట్టు వంటి సంప్రదాయ యుద్ధకళల్లో శిక్షణ కూడా తీసుకుంది. తన పాత్ర నవ్వడం, అరవడం, ఎదిరించడం, పోరాడటం వంటి విభిన్న లక్షణాలను కలిగి ఉంటుందని ఆమె వివరించింది. ఇప్పటివరకు తెరపై తాను కనిపించిన విధానానికి భిన్నంగా ఈ పాత్ర ఉండటం వల్ల నటిగా తనకు కొత్త అనుభవం లభించిందని తెలిపింది. ముఖ్యంగా మహిళలను శక్తివంతమైన వ్యక్తులుగా చూపించే దర్శకుడు పా. రంజిత్‌తో కలిసి పనిచేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని శోభిత పేర్కొంది.

ఇప్పటికే ‘గూఢచారి’, ‘మేజర్‌’, ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న శోభిత.. ‘వెట్టువం’తో మరో విభిన్నమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం తాను గతంలో కంటే ఎక్కువగా శ్రమించానని, తన నటనా ప్రయాణంలో ఇది అత్యంత ప్రత్యేకమైన ప్రాజెక్టుల్లో ఒకటని ఆమె అభిప్రాయపడింది. మరి తెరపై రథి పాత్రలో శోభిత ఏ స్థాయిలో మెప్పిస్తుంది? ఈ సినిమా ఆమె కెరీర్‌కు ఎలాంటి గుర్తింపును తీసుకొస్తుంది? అన్నది చూడాలి.

 

 

[Sobhita Dhulipala, Vettuvam Movie, Sobhita Vettuvam Role, Pa Ranjith, Arya Vettuvam, Dinesh Actor, Sobhita Latest Interview, Kalaripayattu Training, Mallakhamb Training]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com