
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఇప్పుడు కోలీవుడ్‌లోనూ తన జెండాను బలంగా పాతేందుకు సిద్ధమవుతోంది. క్రేజీ ప్రాజెక్టులతో టాలీవుడ్‌లో తిరుగులేని ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ బ్యానర్, తమిళ పరిశ్రమపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. గతంలో తమిళ స్టార్ హీరో ధనుష్‌తో నిర్మించిన 'సార్' (వాతి) సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ద్విభాషా చిత్రంగా వచ్చిన ఆ సినిమా సితార సంస్థకు తమిళ మార్కెట్‌లో మంచి పట్టును తెచ్చిపెట్టింది.
అదే ఊపుతో ఇప్పుడు కోలీవుడ్ టాప్ స్టార్ సూర్యతో కలిసి 'విశ్వనాథ్ అండ్ సన్స్' అనే భారీ చిత్రాన్ని రూపొందిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ భారీ అంచనాలు ఉన్నాయి.
'విశ్వనాథ్ అండ్ సన్స్' సెట్స్ పైన ఉండగానే, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ మరో క్రేజీ కోలీవుడ్ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టినట్లు ఫిలిం నగర్ సమాచారం. ఈసారి తమిళ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా, మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శింబుతో సినిమా చేయడానికి సితార సన్నాహాలు చేస్తోందట.
ప్రస్తుతం శింబు వరుస క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. వెట్రిమారన్ దర్శకత్వంలో వస్తున్న 'అరసన్' చిత్రంతో పాటు, దేశింగ్ పెరియసామి డైరెక్షన్‌లో ఓ సినిమాను కూడా లైన్‌లో పెట్టాడు. ఈ రెండు చిత్రాల అనంతరం సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించే సినిమాలో శింబు నటించనున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను 'డ్యూడ్' ఫేమ్ కీర్తీశ్వరన్ డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఒక డిఫరెంట్ అండ్ ఎమోషనల్ కమర్షియల్ స్క్రిప్ట్‌తో కీర్తీశ్వరన్ శింబును మెప్పించాడని సమాచారం.
ముందుగా ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుందని ప్రచారం జరిగినప్పటికీ, ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ ప్రాజెక్ట్‌ను టేకోవర్ చేసిందని టాక్. ఆగస్టు నెల నుంచే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట.
Sithara Entertainments, Tollywood, Simbu, Keerthiswaran




