సీన్ సితారే: నాలుగు నెలల పాటు సినిమాలే సినిమాలు!
on Sep 19, 2023
ఒక నిర్మాణ సంస్థ నుంచి ఏడాదికి నాలుగైదు సినిమాలు రావడమంటేనే ఓ పెద్ద విషయం. అలాంటిది వరుసగా నాలుగు నెలల పాటు నాలుగుకు మించి చిత్రాలు తెరపైకి రానుండడం.. తెలుగునాట ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రస్తుతం అలా వార్తల్లో నిలుస్తున్న సంస్థ.. సితార ఎంటర్టైన్మెంట్స్. అక్టోబర్ నుంచి జనవరి వరకు ఈ సంస్థ నుంచి వరుసగా సినిమాలు సందడి చేయనున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
అక్టోబర్: ఈ నెలలో సితార నుంచి మ్యాడ్ చిత్రం రాబోతోంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ బావమరిది నితిన్ నార్నే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. బహుశా.. అక్టోబర్ 6న ఈ చిత్రం తెరపైకి వచ్చే అవకాశముంది. ఇక ఇదే నెలలో సితార నుంచి తమిళ అనువాద సినిమా లియో వస్తోంది. విజయ్ హీరోగా నటించిన ఈ మూవీ అక్టోబర్ 19న విడుదల కానుంది. అలాగే, సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న టిల్లు స్క్వేర్ (డీజే టిల్లు సీక్వెల్) కూడా ఇదే నెలలో జనం ముందుకు వచ్చే అవకాశముంది.
నవంబర్: నవంబర్ నెలలో సితార నుంచి వస్తున్న సినిమా ఆదికేశవ. ఇందులో వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించారు. నవంబర్ 10న దీపావళి కానుకగా ఈ మూవీ ఎంటర్టైన్ చేయనుంది.
డిసెంబర్: డిసెంబర్ మాసంలో ఈ సంస్థ నుంచి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రాబోతోంది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ మూవీ డిసెంబర్ 8న థియేటర్స్ లోకి వస్తోంది.
జనవరి: ఈ నెలలో సితార నుంచి కాదు కానీ ఆ బేనర్ కి అనుబంధ సంస్థ అయిన హారికా అండ్ హాసిని క్రియేషన్స్ నుంచి మూవీ వస్తోంది. ఆ చిత్రమే.. గుంటూరు కారం. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్.. జనవరి 12న తెరపైకి రానుంది.
మరి.. సితార సంస్థ నుంచి తక్కువ కాలంలోనే రానున్న ఈ వరుస చిత్రాలు బాక్సాఫీస్ ముంగిట ఎలాంటి సంచలనం సృష్టిస్తాయో చూడాలి.