Home

»

Latest News

ఆ రాజకీయ పార్టీలో చేరిన శ్రష్టి వర్మ.. అసలు ఆట ఇప్పుడు మొదలు కానుందా!

Aug 17, 2026 4:37PM

 

 

జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శ్రష్టి వర్మ తాజాగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు ఈ విషయం సినీ సర్కిల్స్ తో పాటు పొలిటికల్ సర్కిల్స్ లో క్రేజీ న్యూస్ గా మారింది.

హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆమె అధికారికంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఆమెకి  పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. శ్రష్టి వర్మతో పాటు పలువురు వర్ధమాన కళాకారులు, డాన్సర్స్  కూడా భారీ సంఖ్యలో బీజేపీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఇటావా పట్టణానికి చెందిన ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన శ్రష్టి వర్మ చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను చాటుకున్నారు. భరతనాట్యంలో శిక్షణ పొంది, కేవలం 8 ఏళ్ల  వయసులోనే ప్రతిష్టాత్మక 'తాజ్ మహోత్సవ్' వంటి జాతీయ స్థాయి వేదికలపై డ్యాన్స్ ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు అందుకున్నారు. తొలినాళ్లలో పైలట్ కావాలని కలలు కన్నప్పటికీ, నృత్యంపై ఉన్న తీవ్రమైన మక్కువతో మోడలింగ్, డ్యాన్స్ రంగాన్ని ఎంచుకున్నారు. ఈటీవీలో ప్రసారమైన  'ఢీ' డ్యాన్స్ రియాలిటీ షోలో కో డ్యాన్సర్‌గా  తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 'ఢీ-జోడీ' సిరీస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొని, తన అద్భుతమైన స్టెప్పులతో ప్రేక్షకులనే కాక జడ్జిలను సైతం ఫిదా చేసి విపరీతమైన పాపులారిటీ సంపాదించారు.  తెలుగు సినీ రంగానికి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పరిచయమైన శ్రష్టి వర్మ అనతికాలంలోనే అగ్ర కథానాయకుల సినిమాలకు నృత్య రీతులు సమకూర్చే అవకాశాలు దక్కించుకున్నారు. 

Also read: డీసీ మూవీ చూసిన #మహేష్ బాబు.. ఎక్స్ వేదికగా షాకింగ్ రిప్లై

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' చిత్రంలోని 'నువ్వు కావాలయ్యా' మాస్ సాంగ్‌కు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప-2' చిత్రంలోని పాపులర్ 'సూసేకి..' పాటకు ఆమె అసిస్టెంట్‌గా అందించిన కొరియోగ్రఫీ ట్రెండ్ సెట్ చేసింది. వీటితో పాటు 'అల వైకుంఠపురములో', 'క్రాక్', 'బీస్ట్', 'గేమ్ ఛేంజర్', 'మనమే', అలాగే హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన 'కిసి కా భాయ్ కిసి కా జాన్' వంటి భారీ బడ్జెట్ పాన్-ఇండియా చిత్రాలకు ఆమె కొరియోగ్రఫీ టీమ్‌లో కీలక పాత్ర పోషించారు.  డ్యాన్స్ రంగంలోనే కాక 'యథా రాజా తథా ప్రజా' అనే చిత్రంతో నటిగా కూడా మారిన శ్రష్టి వర్మ, బుల్లితెరపై అత్యంత పాపులర్ అయిన 'బిగ్ బాస్: సీజన్-9' లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి తన గ్లామర్, గేమ్‌ప్లేతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలై ప్రజాసేవ చేసేందుకే  శ్రష్టి వర్మ  పార్టీలో చేరినట్లుగా తెలుస్తుంది. 

  Shrasti Verma, Jani Master

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com