
కళ్ళు మూసి తెరిచే లోపు అప్పుడే సంవత్సరంలో ఆరో నెల పూర్తి కాబోతుంది. దీంతో సినీ ప్రియుల్లో అప్పుడే సంక్రాంతి సినిమాల చర్చ మొదలైంది. ఎందుకనే విషయం తెలిసినా సినిమాకి, సంక్రాంతి మధ్య ఉన్న అనుబంధాన్ని చెప్పుకుంటే సంతోషంతో సినీ ప్రియుల ఆయుష్షు తో పాటు విన్న సినీ పాఠకుల ఆయుష్షు కూడా పెరుగుతుంది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంక్రాంతి పండగ సీజన్ అంటే కేవలం పిండి వంటలు, గాలిపటాల హడావుడి మాత్రమే కాదు, అంతకంటే పెద్ద బాక్సాఫీస్ జాతర. ప్రతి ఏడాది లాగే 2027 సంక్రాంతి సీజన్ కూడా ఇండస్ట్రీలో ఒక సరికొత్త రికార్డు సృష్టించడానికి సిద్ధమవుతోంది. టాలీవుడ్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా నలుగురు అగ్ర సీనియర్ హీరోలు ఒకేసారి బాక్సాఫీస్ బరిలో నిలవబోతుండటం సినీ ప్రియుల్లో తీవ్ర ఉత్కంఠని రేపుతోంది. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, మరియు విక్టరీ వెంకటేష్ తమ ప్రతిష్టాత్మక చిత్రాలతో జనవరి 11 నుంచి 15 మధ్య థియేటర్లలో భారీ యుద్ధానికి తెరలేపుతున్నారు. ఇంతటి భారీ కాంపిటీషన్ మధ్య కేవలం టాలీవుడ్ హీరోలు మాత్రమే కాకుండా, కోలీవుడ్ నుంచి సూపర్ స్టార్ రజినీక్యాంత్, సూర్య కూడా తమ చిత్రాలని ఇదే సమయంలో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకోవడంతో ఈ క్లాష్ మరింత రసవత్తరంగా మారింది.
ఈ మహా సంగ్రామంలో మెగాస్టార్ చిరంజీవి బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తన 158వ చిత్రంతో (Mega 158) దూసుకువస్తున్నారు. గతంలో ఈ కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ భారీ విజయం సాధించడమే కాకుండా, చిరంజీవి కెరీర్‌లో సంక్రాంతి సెంటిమెంట్ ఎప్పుడూ సూపర్ హిట్‌లను అందించింది. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత వచ్చిన ‘ఖైదీ నెంబర్ 150’ కూడా సంక్రాంతికే విడుదలై రికార్డులు తిరగరాసింది. ఈ తాజా చిత్రంలో మలయాళ నటి అనస్వర రాజన్ కీలక పాత్ర పోషిస్తుండగా, రాక్‌స్టార్ థమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. మరోవైపు నటసింహం బాలకృష్ణ కూడా సంక్రాంతి రేసులో తగ్గనంటున్నారు. గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో గతంలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ పండగ విజేతగా నిలవడంతో, అదే సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాతో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. ఒకే సీజన్‌లో చిరు మరియు బాలయ్య సినిమాలు పోటీ పడటం అనేది ఇరు వర్గాల అభిమానులకు పూనకాలు తెప్పించే విషయమే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also read:Toxic: భార్య, భర్త బాక్స్ ఆఫీస్ ఫైట్.. టాక్సిక్ కి సరికొత్త ట్విస్ట్
ఈ పోటీకి మరింత గ్లామర్ జోడిస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి కింగ్ నాగార్జున రేసులోకి వచ్చారు. తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రం ‘లాటరీ కింగ్’ ఒకవైపు షూటింగ్ జరుపుకుంటుండగా, మరోవైపు తన ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ సిరీస్ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ పార్ట్-3 (బంగార్రాజు సీక్వెల్) చిత్రాన్ని 2027 జనవరి 15న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించి డేట్ మార్క్ చేసుకోమన్నారు. 2016 జనవరి 15న విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ నాగ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలవగా, 2022 లో వచ్చిన ‘బంగార్రాజు’ కూడా సంక్రాంతి విజేతగా నిలిచింది. ఇక వీరితో పాటు సంక్రాంతి సక్సెస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ఎంటర్‌టైనర్ (VenkyAnil5) ఈ రేసులో అందరికంటే ముందే ప్రమోషన్స్ మొదలుపెట్టి థియేటర్లను బుక్ చేసుకుంది. 'ఎఫ్2', 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాలతో సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన అనిల్ రావిపూడి, ఈసారి కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించడానికి రెడీ అయ్యారు. అయితే ఈ అరడజను భారీ చిత్రాలకు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల సర్దుబాటు చేయడం ఎగ్జిబిటర్లకు పెద్ద సవాలుగా మారనుంది. జనవరి మొదటి వారంలో ఏ ఏ సినిమాలు ఫైనల్‌గా నిలుస్తాయో స్పష్టత రానున్నప్పటికీ, ఈ 2027 సంక్రాంతి మాత్రం బాక్సాఫీస్ వద్ద కళ్ళు చెదిరే కలెక్షన్ల వర్షాన్ని కురిపించడం ఖాయం. ఇక రజినీ , శిబూ కాంబోలో కమల్ హాసన్ తెరకెక్కిస్తున్న మూవీ, సూర్య ,జిత్తు మాధవన్ కాంబో మూవీ కూడా సంక్రాంతి బరిలో దిగనుంది.





