
సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaram). విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి సమంతతో పాటు ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు, చిత్ర దర్శకురాలు నందిని రెడ్డి తదితరులు హాజరయ్యారు. వేడుకలో సమంత స్టేజ్ పై చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
ట్రైలర్ లాంచ్ ప్రెస్ మీట్ సందర్భంగా హోస్ట్ అడిగిన కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు సమంత తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. వేదికపై తన పక్కనే ఉన్న దర్శకులు రాజ్ నిడిమోరు, నందిని రెడ్డిల గురించి చెబుతూ వారిలో నచ్చిన విషయాలు, ఇరిటేట్ చేసే అంశాల గురించి సమంత సరదాగా స్పందించారు.
నందిని రెడ్డి తనకు గత 15 ఏళ్లుగా మంచి స్నేహితురాలని, అందువల్ల ఆమెతో ఇరిటేషన్ అనేది కూడా ఇప్పుడు ఒక అలవాటుగా మారిపోయిందని నవ్వుతూ పేర్కొన్నారు. ఇక రాజ్ నిడిమోరు గురించి మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఆయనతో తనకు ఎలాంటి ఆర్గుమెంట్ జరగలేదని సమంత స్పష్టం చేశారు. నందిని రెడ్డి, రాజ్ నిడిమోరు ఇద్దరూ పని విషయంలో ఎంతో పర్ఫెక్ట్ అని కొనియాడారు.
ఈ సినిమాలో సమంత సాంప్రదాయబద్ధంగా చీరకట్టులో కనిపిస్తూనే భారీ మాస్ యాక్షన్ సీక్వెన్స్ చేయడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. దీనిపై స్పందిస్తూ చీరకట్టులో మాస్ యాక్షన్ చేయడం ఒక కొత్త ట్రెండ్ లా మారిందని అభిప్రాయపడ్డారు. బయటకు క్లాస్ గా కనిపించే తామంతా లోపల చాలా మాస్ అని సమంత చమత్కరించారు. "మేమంతా క్లాస్ అనుకుంటారు కానీ కాదు.. లోపల సూపర్ మాస్.." అంటూ సమంత చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
'మా ఇంటి బంగారం' ట్రైలర్ చూస్తుంటే ఇటు క్లాస్ ఎమోషన్స్, అటు పక్కా మాస్ ఎలిమెంట్స్ కలబోసిన చిత్రంగా అనిపిస్తోంది. సమంత గతంలో ఎన్నడూ చేయని సరికొత్త పాత్రలో మెరవబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.





