Home

»

Latest News

Samantha: అసలు బంగారం సాయి పల్లవే.. ట్విస్ట్ రివీల్ చేసిన సమంత!

Jun 8, 2026 12:24PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొంతకాలం విరామం తర్వాత వెండితెరపై నటిస్తూ, తానే స్వయంగా నిర్మిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaram). నందినీ రెడ్డి దర్శకత్వంలో ఫ్యామిలీ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో నిర్వహించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో సమంత ఈ సినిమాకు సంబంధించి ఒక సంచలన నిజాన్ని బయటపెట్టింది. ఈ ప్రాజెక్ట్‌ కోసం తాను మొదటి ఛాయిస్ కాదని, అసలు ఈ కథ తన కంటే ముందే టాలీవుడ్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) వద్దకు వెళ్ళిందంటూ ఒక పెద్ద ట్విస్ట్‌ను రివీల్ చేసింది.

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంతతో పాటు ప్రముఖ మేకర్స్ రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. మహిళా ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన కథలను ప్రోత్సహించాలనే లక్ష్యంతోనే ఈ బ్యానర్‌ను ప్రారంభించినట్లు సమంత స్పష్టం చేసింది. అందులో భాగంగానే 'మా ఇంటి బంగారం' కథను మొదట సాయి పల్లవికి వినిపించి, ఆమెతోనే నిర్మించాలని చిత్ర బృందం గట్టిగా భావించిందట. అయితే ఆ సమయంలో సాయి పల్లవి వరుస భారీ ప్రాజెక్ట్‌లతో ఎంతో బిజీగా ఉండటం, డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఆమె ఈ సినిమాను అంగీకరించలేకపోయిందని సమంత వివరించింది. ఆ తర్వాత రచయితలు, దర్శకులు ఈ కథలో కొన్ని కీలక మార్పులు చేసి, తన బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగా పూర్తిగా మార్చేశారని తెలిపింది.

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ సమంత సాయి పల్లవిని ట్యాగ్ చేసింది. అంతేకాకుండా, భవిష్యత్తులో తన నిర్మాణ సంస్థలో రూపొందించే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్‌లో సాయి పల్లవితో కలిసి పనిచేయాలని బలంగా కోరుకుంటున్నట్లు తన మనసులోని మాటను బయటపెట్టింది. దీనికి సాయి పల్లవి కూడా ఎంతో సానుకూలంగా స్పందిస్తూ సమంత పోస్ట్‌ను రీషేర్ చేసింది. "ఈ కథ నీ వద్దకు చేరడమే రాసిపెట్టి ఉంది సమంత. నీకు, నందినీ రెడ్డికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.. ఖచ్చితంగా మనం త్వరలోనే కలిసి పనిచేద్దాం" అంటూ లవ్ ఎమోజీలతో రిప్లై ఇచ్చింది. ఈ ఇద్దరు టాప్ హీరోయిన్ల సంభాషణ చూసి అభిమానులు మురిసిపోతున్నారు.

మరోవైపు, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, సీనియర్ నటి గౌతమి, యాంకర్ శ్రీముఖి, మంజూష తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతంలో సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన 'ఓ బేబీ' ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. మళ్లీ వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో బిజినెస్ వర్గాల్లోనూ మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com