
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi) చిత్రంపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులలో కూడా ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. జూన్ 4న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న వేళ, మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పవర్‌ఫుల్ ట్వీట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించబోతోందో చెబుతూ తేజ్ రాసుకొచ్చిన మాటలు మెగా అభిమానులలో పూనకాలు తెప్పిస్తున్నాయి. భారతదేశం అంతటా ఈ చిత్రం సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
సాయి ధరమ్ తేజ్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ.. "పెద్ది పెద్ది పెద్ది.. ఈ పేరు భారతదేశం అంతటా రీసౌండ్ కాబోతోంది" అంటూ తన ట్వీట్ ని ఎంతో పవర్ ఫుల్ గా ప్రారంభించారు. ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక గొప్ప వరంగా మారాలని, అలాగే ఈ వేసవి కాలాన్ని ప్రేక్షకులకు మరింత వినోదాత్మకంగా మార్చాలని తాను ఆశిస్తున్నట్లు తేజ్ పేర్కొన్నారు.
అలాగే రామ్ చరణ్‌ను ట్యాగ్ చేస్తూ.. "చరణ్.. ఇంతటి అర్ధవంతమైన మరియు బలమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నువ్వు పడిన అపారమైన శ్రమ, నీ అంకితభావం ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంటుంది" అని ఆకాంక్షించారు.
ముఖ్యంగా ఈ వైవిధ్యభరితమైన కథను ఎంచుకోవడంలో రామ్ చరణ్ చూపించిన ధైర్యాన్ని (Guts) సాయి ధరమ్ తేజ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సినిమా కోసం చరణ్ తన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ కోసం పడిన కష్టం, అలాగే అందరిపై ఆయన చూపించే ఆప్యాయత అన్నీ కలిసి జూన్ 4న థియేటర్లలో స్పష్టంగా ప్రతిబింబిస్తాయని తేజ్ స్పష్టం చేశారు. జూన్ 4న వెండితెరపై రామ్ చరణ్ నట విశ్వరూపాన్ని చూడటానికి తాను ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సృష్టించిన ఈ అద్భుతమైన ప్రపంచం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని, ఒక కొత్త తరహా సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుందని తేజ్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. అలాగే పెద్ది సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ సాయి ధరమ్ తేజ్ ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.






