
కంటెంట్ బలంగా ఉంటే పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు, పాన్ ఇండియా లెవల్లో రికార్డు మోతలు మోగించవచ్చు అని కాంతార, కాంతార చాప్టర్ 1 తో నిరూపించాడు రిషబ్ శెట్టి. మన దేశ సంస్కృతి, జానపద, దైవిక సంప్రదాయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులకి పరిచయం చేసిన ఘనత కూడా రిషబ్ శెట్టికి దక్కింది. ఈ ఫ్రాంచైజీకి కొనసాగింపుగా వస్తున్న తదుపరి భాగాలపై ఇటు పరిశ్రమ వర్గాల్లోనూ, అటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే రిషబ్ శెట్టి తన పుట్టినరోజుని పురస్కరించుకుని అభిమానులకి డబుల్ గుడ్‌న్యూస్ ఇస్తూ ఒక క్రేజీ అప్‌డేట్ ప్రకటించారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్నాయి
ప్రస్తుతం టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'జై హనుమాన్' షూటింగ్‌లో రిషబ్ శెట్టి బిజీగా ఉన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో పాటు సందీప్ సింగ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక చిత్రం 'ది ప్రైడ్ ఆఫ్ భారత్ – ఛత్రపతి శివాజీ మహారాజ్' లో కూడా ఆయన నటిస్తున్నారు. తన చేతిలో ఉన్న ఈ రెండు భారీ చిత్రాల షెడ్యూల్స్ గురించి స్పష్టతనిస్తూ, ఈ రెండు సినిమాల చిత్రీకరణ ఒకేసారి జరగదని ఆయన స్పష్టం చేశారు. మొదటగా 'జై హనుమాన్' పూర్తి చేసిన తర్వాతే శివాజీ మహారాజ్ బయోపిక్ సెట్స్‌పైకి వెళ్తుందని ప్రకటించారు. ఈ రెండు విభిన్న పాత్రల కోసం తాను పూర్తిగా భిన్నమైన శారీరక రూపాల్లో, సరికొత్త లుక్స్‌లో కనిపించబోతున్నట్లు వెల్లడించారు. ఒకే సమయంలో మల్టీటాస్కింగ్ చేయడం తనకు ఇష్టం ఉండదని, అందుకే ఒక్కో సినిమాని ఎంతో నిబద్ధతతో పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
నేను నటుడిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ, నాలోని దర్శకుడిని అస్సలు ఖాళీగా ఉంచలేను. దర్శకత్వం చేయడం ద్వారానే నాకు మానసిక ప్రశాంతత, నిజమైన ఆనందం లభిస్తాయి. ప్రస్తుతం నా రచయితల బృందంతో కలిసి 'కాంతార: చాప్టర్ 2' స్క్రిప్ట్ పనులని చేయిస్తున్నానని చెప్పుకొచ్చాడు.ఇప్పుడు ఈ మాటలు కాంతార సిరీస్ అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తున్నాయి.






