Home

»

Latest News

అల్లు అర్జున్ కంటే బిగ్‌ అని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రూవ్ చేసుకుంటాడా?

Feb 17, 2022 9:44AM

 

వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ మ‌రోసారి ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ల‌క్ష్యంగా చేసుకొని సోష‌ల్ మీడియా ద్వారా కామెంట్లు చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ టైటిల్ రోల్ చేసిన 'భీమ్లా నాయ‌క్' మూవీని ఫిబ్ర‌వ‌రి 25న తెలుగులోనే కాకుండా హిందీలోనూ రిలీజ్ చేస్తున్న‌ట్లు నిన్న నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. దీనిపై ఆర్జీవీ త‌న‌దైన శైలిలో స్పందించారు. "హిందీలో 'భీమ్లా నాయ‌క్' విడుద‌ల‌వుతుండ‌టం గ్రేట్‌. ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పాన్ ఇండియాకు 'పుష్ప' కంటే త‌న సినిమానే పెద్ద‌ద‌నీ, అల్లు అర్జున్ కంటే తానే బిగ్ అనీ ప్రూవ్ చేసుకోగ‌ల‌గాలి" అని ట్వీట్ చేశారు.

అంతే కాదు, "హిందీలో అల్లు అర్జున్ 'పుష్ప' కంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ 'భీమ్లా నాయ‌క్' బిగ్గ‌ర్ హిట్ అవుతుంద‌నుకుంటున్నారా?" అంటూ ఒక పోల్ కూడా పెట్టారు. దానికి 24 గంట‌ల టైమ్ ఇచ్చారు. 15 గంట‌ల్లో ఆ పోల్‌కు 56 వేల ఓట్లు ప‌డ్డాయి. మొద‌టి గంట‌లోనే దానికి 11 వేల ఓట్లు న‌మోదు కాగా, ఆ టైమ్‌లో ఓటింగ్ స‌ర‌ళిని కూడా ఆయ‌న షేర్ చేశారు. కాదంటూ 53 శాతం మంది, అవుతుందంటూ 47 శాతం మంది ఓటు వేసిన‌ట్లు ఆర్జీవీ షేర్ చేశారు.

కాగా ఫిబ్ర‌వ‌రి 25న హిందీలో మ‌రో క్రేజీ ఫిల్మ్ రిలీజ‌వుతోంది. అది.. ఆలియా భ‌ట్ టైటిల్ రోల్ చేసిన 'గంగూబాయ్ క‌థియ‌వాడి'. అజ‌య్ దేవ్‌గ‌ణ్ ఓ కీల‌క పాత్ర చేసిన ఆ సినిమాకు సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌కుడు. ఆ సినిమాతో 'భీమ్లా నాయ‌క్' పోటీప‌డ‌టం చిన్న విష‌యం కాదు. 'పుష్ప' హిందీలో రిలీజైన‌ప్పుడు దానికి కూడా ర‌ణ‌వీర్ సింగ్ '83' మూవీ, హాలీవుడ్ ఫిల్మ్ 'స్పైడ‌ర్‌మ్యాన్: నో వే హోమ్' నుంచి పోటీ ఎదురైంది. అయిన‌ప్ప‌టికీ ఆ పోటీని అధిగ‌మించి, 'పుష్ప' హిందీ వెర్ష‌న్ రూ. 100 కోట్ల క్ల‌బ్బులో చేరింది. మ‌రి హిందీ 'భీమ్లా నాయ‌క్' కూడా పోటీని త‌ట్టుకుని, విజ‌యం సాధిస్తుందా అనేది ఆస‌క్తిక‌రం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com