తెలుగు, తమిళ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రెజీనా కసాండ్రా తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టారు. గతంలో ఓ ప్రేమ బంధంలో తీవ్రంగా మోసపోయానని, ఆ సంఘటన తనను మానసికంగా కుంగదీసిందని వెల్లడించారు. 2020లో తన చివరి ప్రేమ బంధం ముగిసిపోయిందని, ఆ బాధ నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టిందని ఆమె చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం నయనతార ప్రధాన పాత్రలో నటించిన ‘మూకుత్తి అమ్మన్ 2’ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్న రెజీనా.. ఓ ఇంటర్వ్యూలో తన రిలేషన్‌షిప్ గురించి మాట్లాడారు. 2020లో తన జీవితంలో ఎదురైన నమ్మకద్రోహం తీవ్రంగా బాధించిందని, ఆ సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని తెలిపారు. ఆ మానసిక సంఘర్షణ నుంచి కోలుకోవడం అంత సులభం కాలేదని చెప్పారు. ఆ అనుభవం తర్వాత కొంతకాలం ప్రేమ, డేటింగ్ వంటి బంధాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
ఆ బాధ నుంచి బయటపడటానికి తనకు తాను సమయం కేటాయించుకోవడం, తనను తాను ప్రేమించుకోవడం అలవర్చుకున్నానని రెజీనా వివరించారు. ప్రేమలో విఫలమైనప్పుడు లేదా ఎవరైనా మోసం చేసినప్పుడు తమను తాము నిందించుకోవద్దని మహిళలకు సూచించారు. లైంగిక వేధింపులు, ఇతర చేదు అనుభవాలు ఎదురైనప్పుడు వాటిని మనసులోనే దాచుకోకుండా ధైర్యంగా బయటకు చెప్పుకోవాలని అన్నారు. బాధ కలిగినప్పుడు ఏడవాలనిపిస్తే ఏడవాలని, ఆ భావాలను అణచుకోవాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు.
అయితే తనను మోసం చేసిన వ్యక్తి ఎవరనే విషయాన్ని మాత్రం రెజీనా వెల్లడించలేదు. గతంలోనూ తన రిలేషన్‌షిప్స్ గురించి బహిరంగంగా మాట్లాడిన ఆమె, ఇప్పుడు మరోసారి వ్యక్తిగత జీవితంలోని అనుభవాలను పంచుకోవడంతో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం సినిమాలపై దృష్టి పెడుతూ విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు రెజీనా.
[Regina Cassandra, Regina Cassandra Breakup, Regina Cassandra Relationship, Regina Cassandra Heartbreak, Regina Cassandra Interview, Regina Cassandra Depression, Mookuthi Amman 2, Regina Cassandra Latest News]





