
టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్న విలక్షణ దర్శకుడు, నటుడు రవిబాబు (Ravi Babu) తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. రవిబాబు తన తాజా చిత్రం 'రేజర్' (Razor) ప్రమోషన్స్‌లో భాగంగా 'తెలుగువన్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుత టాలీవుడ్ మూవీ మేకింగ్ ప్రాసెస్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మేకింగ్ విధానంపై అసహనం:
"అప్పుడు సినిమాలు తీసేవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసేవాళ్ళు.. ఇప్పుడు సినిమాలు తీసేవాళ్ళు ఒళ్ళు బలిసి చేస్తున్నారు." అంటూ రవిబాబు ఫైర్ అయ్యారు. ఒకప్పుడు సినిమా అంటే క్రమశిక్షణతో, తక్కువ సమయంలో పూర్తి చేసేవారని.. ఇప్పుడు కేవలం అహంకారంతో, అనవసరమైన హంగులతో ఏళ్ల తరబడి సాగదీస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలా షూటింగ్‌లను సాగదీయడం వల్ల నిర్మాతల బడ్జెట్ అదుపు తప్పుతోందని, ఇది పరిశ్రమకు ఏమాత్రం మంచిది కాదని రవిబాబు అభిప్రాయపడ్డారు.
ఒకప్పుడు పక్కా ప్లానింగ్‌తో తక్కువ సమయంలో నాణ్యమైన సినిమాలు వచ్చేవి, కానీ ఇప్పుడు కథ కంటే హంగులకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యంగా రచయితలు, దర్శకులు హీరోల చుట్టూ తిరగడం వల్ల కథా బలం తగ్గుతోందని, ఇది నిర్మాతల బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. కేవలం హీరోల ఇమేజ్ కోసం కథను మార్చడం లేదా సాగదీయడం సినిమా నాణ్యతను దెబ్బతీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
హీరోల డూప్ సంస్కృతిపై విమర్శ
రవిబాబు చేసిన మరో సంచలన వ్యాఖ్య హీరోల యాక్షన్ సీక్వెన్సుల గురించి. టాలీవుడ్‌లోని సుమారు 90 శాతం మంది హీరోలు రిస్కీ ఫైట్స్ చేసేటప్పుడు డూప్స్‌పైనే ఆధారపడుతున్నారని ఆయన ఆరోపించారు. దీనివల్ల సహజత్వం లోపిస్తుందని అన్నారు. తన తాజా చిత్రం 'రేజర్' కోసం తాను ఎటువంటి డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేశానని, ఆ విషయంలో రాజీ పడలేదని స్పష్టం చేశారు. నటులు తమ పని పట్ల మరింత నిబద్ధతతో ఉండాలని ఆయన సూచించారు. మొత్తానికి రవిబాబు చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
రవిబాబు ఫుల్ ఇంటర్వ్యూతో పాటు మరిన్ని ఆసక్తికర ఇంటర్వ్యూల కోసం తెలుగువన్ (TeluguOne) యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.





