
తెలుగుతో పాటు కన్నడంలోనూ కొన్ని సూపర్‌హిట్ సినిమాల్లో నటించిన రష్మికా మందన్నకు 'పుష్ప' సినిమా దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్‌ను సంపాదించి పెట్టింది. అల్లు అర్జున్ టైటిల్ రోల్ చేసిన ఆ సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక నటన ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. సినిమాల విషయం అటుంచితే, టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో ఆమె అనుబంధం తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. అయితే తాము కేవలం గుడ్ ఫ్రెండ్స్ మాత్రమేనని ఆ ఇద్దరూ ఎన్నిసార్లు చెప్తున్నా, వారిపై రూమర్స్ మాత్రం ఆగడం లేదు. కాగా, 'ఇండియా టుడే'కు ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడింది రష్మిక.
"నాకు సంబంధించినంతవరకు, ఒకరికొకరు గౌరవం, సమయం ఇచ్చిపుచ్చుకునేటప్పుడు, మీరు సురక్షితంగా ఉన్నారని భావించినప్పుడు ప్రేమ అనేది పుడుతుంది. ప్రేమను వర్ణించడం కష్టం, ఎందుకంటే ఇది ఫీలింగ్స్‌కు సంబంధించినది. ప్రేమ అనేది రెండు వైపులా ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది, కేవలం ఒకవైపే ఉంటే కాదు." అని ఆమె చెప్పింది.
పెళ్లి గురించి మాట్లాడుతూ, "దాని గురించి ఏం ఆలోచించాలో నాకు తెలియదు, ఎందుకంటే నేను ప్రస్తుతం చాలా చిన్నదాన్ని. నేను దాని గురించి ఆలోచించలేదు. కానీ, అలా చెప్పాలంటే, మనల్ని సౌకర్యంగా ఉంచే వ్యక్తితో మనం ఉండాలి." అని రష్మిక చెప్పింది.
వర్క్ విషయానికి వస్తే, శర్వానంద్ జోడీగా ఆమె నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' ఈ నెల 25న విడుదలకు రెడీ అవుతోంది. అల్లు అర్జున్‌తో 'పుష్ప 2' మూవీ చేస్తోన్న రష్మిక, హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రాతో 'మిషన్ మజ్ను', అమితాబ్ బచ్చన్‌తో 'గుడ్‌బై' సినిమాలు చేస్తోంది.






