అనంతపురం జిల్లా రాప్తాడులో పాఠశాల తరగతి గదిలోకి చొరబడిన ఓ యువకుడు రంపంతో పదో తరగతి బాలికపై దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ దారుణ ఘటన తర్వాత సినిమాల్లో హింసాత్మక సన్నివేశాల ప్రభావంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ సినిమాలోని స్కూల్ సీన్‌ను పలువురు ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు.
సినిమాల్లో హింసను చూపించడం వల్ల సమాజంలో నేరాలు పెరుగుతున్నాయని విమర్శించడం సరైనది కాదని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ.. ‘హింస పెరుగుతోందని సినిమాలను నిందించడం, కిడ్నాప్‌లు పెరుగుతున్నాయని రామాయణాన్ని నిందించడంతో సమానం’ అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. సినిమాలపై వస్తున్న విమర్శలు సరైన దిశలో లేవని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అయితే ఆర్జీవీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలు నేరాలకు నేరుగా కారణం కాకపోవచ్చని, కానీ తెరపై హింసను గొప్పగా చూపించడం యువత ఆలోచనలపై ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ‘యానిమల్’ సినిమాలో రణ్‌బీర్ కపూర్ తుపాకీతో స్కూల్ క్లాస్‌రూమ్‌లోకి వెళ్లే సన్నివేశాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తున్నారు. మరోవైపు దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఆర్జీవీ గతంలోనూ మద్దతుగా నిలిచిన విషయాన్ని కొందరు గుర్తుచేస్తున్నారు.
ఇదిలా ఉంటే, యూట్యూబర్ ధ్రువ్ రాఠీ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ ‘యానిమల్’, ‘ధురంధర్’ వంటి సినిమాలపై విమర్శలు చేశారు. దీంతో సినిమా హింస, దాని ప్రభావం, దర్శకుల సామాజిక బాధ్యత వంటి అంశాలపై మరోసారి చర్చ మొదలైంది. సినిమాల్లో చూపించే హింసకు, నిజ జీవిత నేరాలకు మధ్య సంబంధం ఎంతవరకు ఉంటుంది? సృజనాత్మక స్వేచ్ఛతో పాటు చిత్ర పరిశ్రమకు సామాజిక బాధ్యత కూడా ఉందా? అనే ప్రశ్నలు ఇప్పుడు నెట్టింట చర్చకు వస్తున్నాయి.
[Ram Gopal Varma, RGV, Raptadu Incident, RGV Latest Comments, Movie Violence Debate, Animal Movie, Sandeep Reddy Vanga, Dhruv Rathee, Cinema and Violence, Telugu Cinema News]





