సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ అంటేనే వివాదాలకి కేరాఫ్ అడ్రస్. అయితే, తాజాగా ఆయన తన సినిమాలకు పనిచేసిన టెక్నీషియన్ల బకాయిల విషయంలో కార్మిక సంఘం నుంచి గట్టి ఒత్తిడి ఎదుర్కొన్నారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న టెక్నీషియన్ల వేతనాలను ఎట్టకేలకు వర్మ క్లియర్ చేయడంతో, ఆగిపోయిన షూటింగ్ మళ్ళీ పట్టాలెక్కింది.
తాజాగా వర్మ దర్శకత్వంలో 'పోలీస్ కంపెనీ' సినిమా షూటింగ్ ముంబైలో మొదలైంది. అయితే, సెట్స్‌లోకి ప్రవేశించిన సినీ కార్మికుల సంఘం (FWICE) ప్రతినిధులు, బకాయిలు అందే వరకు షూటింగ్‌ను కొనసాగనివ్వమని తేల్చి చెప్పారు. దీంతో వర్మ వెంటనే స్పందించి, రూ. 1.32 కోట్ల మొత్తాన్ని చెల్లించడంతో ఈ వివాదం సద్దుమణిగింది.
ఈ బకాయిల చరిత్ర చూస్తే.. ఇవి కేవలం ఇప్పటివి కావు. వర్మ గతంలో తెరకెక్కించిన 'సర్కార్', 'సర్కార్ 3' వంటి సినిమాల సమయంలోనే టెక్నీషియన్లకు చెల్లించాల్సిన వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని కార్మిక సంఘం ఆరోపిస్తోంది. 2019లోనే ఈ బకాయిలను చెల్లిస్తానని వర్మ రాతపూర్వకంగా హామీ ఇచ్చినప్పటికీ, అవి ఆచరణలో అమలు కాలేదని సంఘం ప్రతినిధులు వెల్లడించారు.
గత కొన్నేళ్లుగా వర్మ అందుబాటులో లేకపోవడం, ఆఫీసులు మూసివేయడం వంటి కారణాలతో టెక్నీషియన్లకు డబ్బులు అందలేదు. అయితే, వర్మ గోవాలో ఉన్నారని తెలిసి కూడా ప్రయత్నాలు జరిగాయని, తాజాగా ఆయన హైదరాబాద్‌లో చిన్న సినిమాలతో బిజీగా ఉండటంతో, 'పోలీస్ కంపెనీ' షూటింగ్‌ను అడ్డుకోవడం ద్వారా సంఘం గట్టిగా నిలదీసింది.
పరిశ్రమలోని పలువురు ప్రముఖులు మధ్యవర్తిత్వం వహించడంతో, వర్మ మొత్తాన్ని చెల్లించేందుకు ఒప్పుకున్నారు. డబ్బులు అందిన తర్వాతే షూటింగ్‌కు అనుమతి ఇచ్చినట్లు FWICE అధ్యక్షుడు బీఎన్ తివారీ తెలిపారు. ఈ సంఘటన ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇక వర్మ తాజా ప్రాజెక్ట్ 'పోలీస్ కంపెనీ' విషయానికి వస్తే.. ఇందులో హర్షవర్ధన్ రాణే ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో, ప్రఖ్యాత దయా నాయక్ పాత్రను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.






