
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులను ఆందోళనకు గురిచేసే వార్త ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్న 'పెద్ది' సినిమా చిత్రీకరణ సమయంలో రామ్ చరణ్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో ఆయనకు మణికట్టుకు సర్జరీ అవసరమని వైద్యులు నిర్ధారించడంతో, మెగాస్టార్ కుటుంబం కోయంబత్తూరుకు పయనమైంది.
హైదరాబాద్‌లోని బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి, తల్లి సురేఖ, భార్య ఉపాసనతో కలిసి రామ్ చరణ్ కోయంబత్తూరు చేరుకున్నారు. అక్కడ ప్రముఖ గంగా హాస్పిటల్ లో నేడు(జూలై 27) ఆయన మణికట్టుకు డాక్టర్లు సర్జరీ నిర్వహించనున్నారు.
'పెద్ది' సినిమాలో కుస్తీ నేపథ్యంలో సాగే రిస్కీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో రామ్ చరణ్ మణికట్టుకు తీవ్రమైన గాయమైంది. ఆ సమయంలోనే వైద్యులు వెంటనే సర్జరీ చేయించుకోవాలని సూచించినప్పటికీ.. సినిమా నిర్మాణం, ప్రమోషన్ల పనులకు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో చరణ్ ఆపరేషన్‌ను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. చేతికి గాయం ఉన్నా, కట్టు కట్టుకుని ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొని తన నిబద్ధతను చాటుకున్నారు. చరణ్ చూపిన ఈ డెడికేషన్‌పై టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
సర్జరీ పూర్తయిన తర్వాత రామ్ చరణ్ కోలుకోవడానికి కొన్ని వారాల పాటు వైద్యులు బెడ్ రెస్ట్ రికమండ్ చేశారు. దీంతో చరణ్ తదుపరి ప్రాజెక్టుల చిత్రీకరణ షెడ్యూళ్లపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ 'RC17' షూటింగ్ కాస్త ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సుకుమార్ ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేసి, ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశారు. అయితే రామ్ చరణ్ పూర్తిగా కోలుకుని, ఫిట్‌నెస్ సాధించిన తర్వాతే సెట్స్‌పైకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం.
Ram Charan, Wrist Surgery, Coimbatore, Peddi Movie, Chiranjeevi





