
'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో సరికొత్త చిత్రం అధికారికంగా ప్రారంభం కానుంది. మెగాస్టార్ కెరీర్‌లో 158వ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ భారీ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ లాంచ్ రేపు ఉదయం జరగనుందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కేవలం ఒక సాధారణ ముహూర్తపు వేడుకలా కాకుండా, మెగా ఫ్యాన్స్ అందరూ కాలమంతా గుర్తుంచుకునేలా ఒక 'మెగా సెలబ్రేషన్' గా దీనిని ప్లాన్ చేశారు.
ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌కు మరింత గ్లామర్, ఎనర్జీని తీసుకురావడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ముఖ్య అతిథిగా విచ్చేస్తుండటం విశేషం. గ్లోబల్ స్టార్‌గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్, తన తండ్రి చిరంజీవి-దర్శకుడు బాబీ ల కొత్త ప్రాజెక్ట్‌ను క్లాప్ కొట్టి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. గతంలో బాబీ దర్శకత్వంలో 'వాల్తేరు వీరయ్య' బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడంతో, ఈ రెండో కలయికపై అటు ట్రేడ్ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చిరంజీవిని వింటేజ్ మాస్ లుక్‌లో ప్రెసెంట్ చేయడంలో బాబీ దిట్ట అని నిరూపించుకున్న నేపథ్యంలో, ఈసారి మరింత పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌తో రాబోతున్నట్లు సమాచారం.
ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుండి ప్రారంభం కానుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను రేపటి లాంచ్ ఈవెంట్‌లో అధికారికంగా వెల్లడించనున్నారు.





