టాలీవుడ్‌లో సినిమా టికెట్ ధరలు, థియేటర్లలో ఆహార పదార్థాల రేట్లు ఎప్పుడూ హాట్ టాపిక్కే. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన రాబోయే చిత్రం ‘పెద్ది’ ప్రమోషన్స్ మరియు పలు ఇంటర్వ్యూలలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలోనూ సరికొత్త చర్చకు తెరలేపాయి. ఆయన మాటలపై ఇటు అభిమానులు, అటు సామాన్య ప్రేక్షకులు భిన్నంగా స్పందిస్తున్నారు.
ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. భారతదేశంలో సినిమా అనేది ఇప్పటికీ సామాన్యుడికి అత్యంత చౌకైన వినోద సాధనమని పేర్కొన్నారు. కుటుంబంతో కలిసి థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఆస్వాదించడం ఎంతో ప్రత్యేకమైనదని చెబుతూనే, థియేటర్లలో పాప్‌కార్న్ మరియు ఇతర స్నాక్స్ ధరలను కాస్త తగ్గిస్తే ప్రేక్షకులకు మరింత వెసులుబాటుగా ఉంటుందని చరణ్ అభిప్రాయపడ్డారు.
అయితే ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు, సినీ ప్రియులు గట్టిగానే రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం పెద్ద సినిమాల రిలీజ్ సమయంలో ప్రత్యేక అనుమతులతో టికెట్ ధరలను భారీగా పెంచేస్తున్నారని, అలాంటప్పుడు సినిమా ‘చీప్ ఎంటర్టైన్మెంట్’ ఎలా అవుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఒక సామాన్య కుటుంబం థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలంటే వేలల్లో ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే క్రమంలో నెటిజన్లు అసలు ముడిని విప్పారు. థియేటర్లలో పాప్‌కార్న్ రేట్లు తగ్గాలన్న చరణ్ సూచన బాగుందని మెచ్చుకుంటూనే.. అంతకంటే ముందు కోట్లల్లో పెరిగిపోతున్న స్టార్ హీరోల రెమ్యునరేషన్లపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్నారు. హీరోల భారీ పారితోషికాల వల్లే ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతోందని, ఆ భారాన్ని మేకర్స్ టికెట్ రేట్ల రూపంలో ప్రేక్షకులపైనే నెడుతున్నారని కామెంట్లు పెడుతున్నారు.
కంటెంట్ బలంగా ఉంటే భారీ బడ్జెట్లు, వందల కోట్ల రెమ్యునరేషన్లతో పనిలేకుండానే సినిమాలు ఆడుతాయని ఇండస్ట్రీ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే స్టార్ హీరోల మార్కెట్ వల్లే బిజినెస్ జరుగుతుందని మరికొందరు సమర్థిస్తున్నారు.




