Home

»

Latest News

'పెద్ది' మూవీ ట్రోలర్స్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల సీరియస్ యాక్షన్!

May 29, 2026 4:37PM

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ లేటెస్ట్ మూవీ ‘పెద్ది’ విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ చిత్ర యూనిట్ స్పీడ్ పెంచింది. జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇదే సమయంలో సోషల్ మీడియా వేదికగా సినిమాపై తప్పుడు ప్రచారం, అభ్యంతరకరమైన ట్రోలింగ్ చేస్తున్న కొందరు నెటిజన్లపై చిత్ర బృందం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల విడుదలైన ‘పెద్ది’ ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్‌పై కొందరు సోషల్ మీడియా యూజర్లు కావాలనే నెగెటివ్ కామెంట్లు, అనుచిత ట్రోల్స్ మొదలుపెట్టారు. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రఫ్ లుక్‌పై, అలాగే ఈ చిత్రంలోని కొందరు నటీనటులపై వ్యక్తిగత దూషణలకు దిగడంతో చిత్ర యూనిట్ గట్టి కౌంటర్ ఇవ్వాలని నిశ్చయించుకుంది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు సినిమా విజయావకాశాలను దెబ్బతీసేలా ఉన్నాయని భావించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు.

ఈ ఇష్యూ పై చిత్ర సీనియర్ నిర్మాతలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. పరిశ్రమ మొత్తం ఒక భారీ చిత్రాన్ని సపోర్ట్ చేయాల్సిన సమయంలో ఇలాంటి అర్థం లేని ట్రోలింగ్స్ చేయడం కరెక్ట్ కాదని హెచ్చరిస్తున్నారు. నెగెటివిటీ వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని మేకర్స్ గట్టి సంకేతాలు పంపారు.

‘ఉప్పెన’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 1980ల కాలం నాటి పల్లెటూరి నేపథ్యంలో క్రికెట్, కుస్తీ, రన్నింగ్ వంటి క్రీడల్లో రాణించే ఒక మల్టీ టాలెంటెడ్ యువకుడిగా రామ్‌చరణ్ ఈ చిత్రంలో వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ అందించారు.

ఇప్పటికే సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ వర్సెస్ యాంటీ ఫ్యాన్స్ మధ్య ఈ ట్రోలింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. సైబర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడంతో ట్రోలర్స్ ఇప్పుడు కాస్త సైలెంట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. భారీ రన్‌టైమ్‌తో రాబోతున్న ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com