గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన మోస్ట్ అవేటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' థియేటర్లలోకి వచ్చేసింది. ఈ రోజు విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచే అభిమానులను, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మెగా పవర్ స్టార్ మాస్ మేకోవర్, స్క్రీన్ ప్రెజెన్స్ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తుండటంతో.. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు వసూళ్ల వర్షం కురుస్తోంది.
ముఖ్యంగా ఆంధ్రా, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 'పెద్ది' సినిమా ఈవెనింగ్ అండ్ నైట్ షోస్ స్టేటస్ చూస్తే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. నైజాం (హైదరాబాద్) పరిధిలో అడ్వాన్స్ బుకింగ్స్ ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ, సాయంత్రం ఆటలకు వచ్చేసరికి దాదాపు అన్ని థియేటర్లలో 'హౌస్‌ఫుల్' బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇటు వైజాగ్, విజయవాడ, గుంటూరు వంటి మేజర్ సిటీస్‌లో కూడా రికార్డు స్థాయి అక్యుపెన్సీ నమోదవుతోంది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఆంధ్రాలోని వైజాగ్, కాకినాడ వంటి ప్రాంతాల్లో సాయంత్రం షోలకు ఏకంగా 85 శాతం పైగా అక్యుపెన్సీ కనిపించింది. హైదరాబాద్ లాంటి భారీ మార్కెట్‌లో 1100 కి పైగా షోలు ప్రదర్శితమవుతుండగా, అందులో సగం కంటే ఎక్కువ థియేటర్లు నిండిపోయాయి. ఇక ప్రీమియం ఐమాక్స్, ఎపిక్ (EPIQ) ఫార్మాట్లలోనైతే టికెట్లు దొరకడమే గగనంగా మారింది.
'ఉప్పెన' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ సరికొత్త లుక్‌లో కనిపించారు. 1980ల నాటి పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా కోసం చరణ్ తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ పూర్తిగా మార్చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
సోషల్ మీడియాలో 'పెద్ది' హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. రామ్ చరణ్ కెరీర్‌లోనే ఇదొక బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. తొలిరోజే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. లాంగ్ వీకెండ్ కూడా కలిసిరానుండటంతో రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని కొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.




