మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ముగియడంతో, చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలో దర్శకుడు బుచ్చిబాబు సానా, హీరో రామ్ చరణ్ ఒక చిన్న సరదా కార్ డ్రైవ్‌కు వెళ్లారు. ఈ ప్రయాణంలో సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను, షూటింగ్ కష్టాలను వారిద్దరూ పంచుకున్నారు.
ఈ డ్రైవింగ్ ముచ్చట్లలో బుచ్చిబాబు మాట్లాడుతూ, రామ్ చరణ్ డెడికేషన్ చూసి తాను ఎంతగానో ఇన్స్పైర్ అయ్యానని చెప్పారు. దిల్‌సుఖ్‌నగర్‌లో ఎంబీఏ చదివే రోజుల్లో జిమ్‌కు ఫీజు కట్టినా ఎప్పుడూ వెళ్లని తాను, రామ్ చరణ్ ఫిట్‌నెస్ పట్ల చూపే శ్రద్ధను చూసి రోజూ 40 నిమిషాలు వ్యాయామం చేయడం అలవాటు చేసుకున్నానని చెప్పుకొచ్చారు. చరణ్ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్ కానుందని ఆయన వెల్లడించారు.
అయితే ఈ లుక్స్ వెనుక చరణ్ పడిన టార్చర్ అంతా ఇంతా కాదట. కథ ప్రకారం రామ్ చరణ్ ఇందులో క్రాస్ ఓవర్ అథ్లెట్‌గా కనిపించనున్నారు. ఇందుకోసం ముందు తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా లాంటి వారిని పోలిన క్రికెట్ బాడీ అడిగిన దర్శకుడు, ఆ తర్వాత కొండల్లో తిరిగే ఒక ట్రైబల్ లుక్, ఆపై కేవలం రెండు మూడు నెలల వ్యవధిలోనే బండగా ఉండే కుస్తీ (రెజ్లింగ్) బాడీ లుక్ కావాలని అడిగారట. ఇంత తక్కువ టైమ్‌లో బాడీని మార్చడం చాలా కష్టమైనా, చరణ్ దాన్ని అద్భుతంగా సాధించారని బుచ్చిబాబు కొనియాడారు.
కుస్తీ ఫైట్ల చిత్రీకరణ సమయంలో నిజమైన పహిల్వాన్‌లతో షూట్ చేయడం వల్ల రామ్ చరణ్‌కు ఒంటి నొప్పులు కూడా వచ్చాయట. ఒక సీన్ లో ఒరిజినల్ పహిల్వాన్ ఆవేశంలో చరణ్ మెడ పట్టుకుని గట్టిగా తిప్పేయడంతో బుచ్చిబాబు ఎంతో కంగారు పడ్డారట. రంగస్థలం, ఆర్ఆర్ఆర్, గేమ్ చేంజర్ సినిమాల్లాగే ఈ సినిమా షూటింగ్‌లో కూడా చిన్న చిన్న గాయాలైనా ఎక్కడా ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపకుండా పూర్తి చేశామని రామ్ చరణ్ గుర్తు చేసుకున్నారు.
సినిమాలోని ఢిల్లీ ఎపిసోడ్ తనకు ఎంతో ఇష్టమైనదని, ఆ సీన్లు ఎడిటింగ్ రూమ్‌లో చూసిన ప్రతిసారీ చరణ్‌కు ఫోన్ చేసి మురిసిపోయానని బుచ్చిబాబు అన్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ, లైటింగ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని, ఇక ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విజువల్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు మార్చేసిందని తెలిపారు. సినిమాలో వచ్చే బిగ్గెస్ట్ ట్విస్ట్ ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని వారిద్దరూ నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ ముచ్చట్లలో రామ్ చరణ్ తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో మానసికంగా చాలా లో ఫేస్ చూశానని, ఆ సమయంలో దర్శకుడు రాజమౌళి ఇచ్చిన సలహాతోనే మళ్లీ మోటివేషన్ పొంది చిన్న చిన్న పనులతో జీవితాన్ని ట్రాక్‌లోకి తెచ్చుకున్నానని చెప్పారు. సరిగ్గా 'పెద్ది' క్యారెక్టర్ కూడా జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, పడిపోయినా మళ్లీ ఎలా లేచి నిలబడాలి అనే పాయింట్ మీదే సాగుతుందని, నేటి తరానికి ఇది ఒక గ్రేట్ మోటివేషన్ ఇన్స్పిరేషనల్ స్టోరీ అవుతుందని స్పష్టం చేశారు.
హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి మాట్లాడుతూ, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ఒక హీరోలా ఉంటుందని, కొన్ని సీన్లలో ఆమెను చూస్తే లెజెండరీ నటి శ్రీదేవి గారే గుర్తొస్తారని చరణ్ ప్రశంసించారు. ఫ్యాన్స్ గర్వపడేలా ఒక అద్భుతమైన, నిజాయితీ గల కథతో ఈ సినిమా వస్తోందని, థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం ధీమాగా ఉంది.






