
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న పీరియాడిక్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi) బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల వేటను మొదలుపెట్టింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ తాజాగా తన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా రన్‌టైమ్ విషయంలో దర్శకుడు బుచ్చిబాబు సన సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఏకంగా 3 గంటల 9 నిమిషాల (189 నిమిషాలు) భారీ నిడివితో లాక్ అయినట్లు సమాచారం.
ప్రస్తుత రోజుల్లో ఒక కమర్షియల్ సినిమాకు మూడు గంటల కంటే ఎక్కువ రన్‌టైమ్ ఉండటం అంటే అది బాక్సాఫీస్ వద్ద చాలా పెద్ద రిస్క్ అనే చెప్పాలి. ప్రేక్షకులు అంత సేపు థియేటర్లలో కూర్చోవాలంటే కథలో, కథనంలో అద్భుతమైన డ్రామా, ఎమోషన్ ఉండాలి. గతంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’, ‘యానిమల్’ వంటి చిత్రాలు భారీ రన్‌టైమ్‌తో వచ్చి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాయి. ఇప్పుడు అదే నమ్మకంతో బుచ్చిబాబు కూడా ‘పెద్ది’ చిత్రం కోసం ఎలాంటి ట్రిమ్మింగ్స్ లేకుండా, తను అనుకున్న భావోద్వేగాలను పూర్తి స్థాయిలో వెండితెరపై చూపించడానికే ఈ సుదీర్ఘ నిడివిని లాక్ చేశారట. ముఖ్యంగా సినిమాలో వచ్చే ఎమోషనల్ సీన్లు, కుస్తీ ఎపిసోడ్లు, రామ్ చరణ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను సీట్లకు అతుక్కుపోయేలా చేస్తాయని సెన్సార్ బోర్డు వర్గాల నుండి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.
1980ల నాటి పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ ప్యూర్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ ఒక విలక్షణమైన రూరల్ రోల్‌లో కనిపించనున్నారు. చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న పెద్ది సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. నేడు(మే 18) విడుదలవుతున్న ట్రైలర్ తో అంచనాలు రెట్టింపయ్యే అవకాశముంది.





