
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా "పెద్ది" (Peddi). ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచేసింది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ నార్త్ ఇండియా మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని సరికొత్త ప్రమోషన్స్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా "పెద్ది కీ ఆవాజ్" (Peddi Ki Awaaz) అనే గ్రాండ్ మ్యూజికల్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు.
మే 23న సాయంత్రం 5 గంటల నుండి భోపాల్‌లోని ప్రసిద్ధ భేల్ (BHEL) దసరా మైదానంలో ఈ భారీ ఈవెంట్ ప్రారంభం కానుంది. టాలీవుడ్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఒక ప్రమోషనల్ ఈవెంట్ కోసం నిర్మాతలు ఏకంగా ₹2.5 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ మ్యూజికల్ నైట్ ఈవెంట్‌లో ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతుండటం విశేషం. ఆయన తన బృందంతో కలిసి "పెద్ది" సినిమాలోని దాదాపు 4 పాటలను లైవ్‌లో పాడి అక్కడి నార్త్ ఆడియన్స్‌ను అలరించనున్నారు. ఈ వేడుకలో సినిమాలోని ఒక ప్రత్యేకమైన స్పెషల్ సాంగ్‌ను అధికారికంగా లాంచ్ చేయనున్నారు. ఈ డ్యాన్స్ నంబర్‌లో రామ్ చరణ్‌తో పాటు స్టార్ హీరోయిన్ శృతి హాసన్, అలాగే కథానాయిక జాన్వీ కపూర్ కూడా సందడి చేయనున్నారు.
సుమారు ₹300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా హిందీ బెల్ట్‌లో కూడా గట్టి ప్రభావం చూపించాలనే ఉద్దేశంతోనే మేకర్స్ ఇంత భారీ ఖర్చుతో భోపాల్‌లో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.
ఈ చిత్రంలో రామ్ చరణ్ ఒక పవర్‌ఫుల్ అథ్లెట్, రెజ్లర్‌గా కనిపిస్తుండగా, జాన్వీ కపూర్ 'అచ్చాయమ్మ' పాత్రలో నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని, ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమా.. మే 23న భోపాల్‌లో జరగబోయే మ్యూజికల్ ఈవెంట్‌తో బాలీవుడ్ హృదయాలను సైతం గెలుచుకోవడానికి సిద్ధమవుతోంది.






