గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'పెద్ది' థియేటర్లలోకి వచ్చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తొలి ఆట నుంచే ఊచకోత మొదలుపెట్టింది. బుధవారం రాత్రి ప్రదర్శించిన ప్రీమియర్ షోల నుంచే ఈ మెగా చిత్రం రికార్డుల వేటను అట్టహాసంగా ప్రారంభించింది.
ముఖ్యంగా కర్ణాటక బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' సృష్టించిన ప్రభంజనం ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. అక్కడ కేవలం ప్రీమియర్ షోల ద్వారానే ఈ సినిమా ఏకంగా రూ. 3.2 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ వసూళ్లతో గతంలో పవన్ కళ్యాణ్ 'ఓజీ' (రూ. 2.72 కోట్లు) పేరిట ఉన్న హయ్యెస్ట్ ప్రీమియర్ రికార్డును చరణ్ క్లీన్ స్వీప్ చేసేశారు. ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న 'రాజా సాబ్', 'పుష్ప 2' చిత్రాలను కూడా దాటేసి కర్ణాటకలో సరికొత్త చరిత్ర లిఖించింది.
ఆన్ లైన్ టికెట్ బుకింగ్స్ లోనూ ఈ సినిమా సంచలనాలు నమోదు చేస్తోంది. ప్రముఖ బుకింగ్ యాప్ బుక్ మై షో లో గంటకు దాదాపు 40 వేల టికెట్లు అమ్ముడవుతూ 'పెద్ది' సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో కేవలం 'కల్కి 2898 ఏడీ', 'సలార్', 'పుష్ప 2' లాంటి భారీ చిత్రాలకు మాత్రమే ఈ స్థాయి అవర్లీ ట్రెండింగ్ దక్కగా, ఇప్పుడు ఆ ఎలైట్ క్లబ్ లోకి రామ్ చరణ్ కూడా అడుగుపెట్టారు. రిలీజ్ కు ముందే ఈ సినిమాకు 10 లక్షలకు పైగా అడ్వాన్స్ టికెట్లు అమ్ముడవడం విశేషం.
'రంగస్థలం' లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ ఊరమాస్ లుక్ లో నటిస్తున్న సినిమా కావడంతో 'పెద్ది'పై ట్రేడ్ లోనూ, ప్రేక్షకులలోనూ మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా మలిచారు. కేవలం ఇండియాలోనే కాదు, ఓవర్సీస్ లోనూ ఈ సినిమా ర్యాంపేజ్ నడుస్తోంది. నార్త్ అమెరికా ప్రీమియర్స్ లోనే ఈ చిత్రం $1.5 మిలియన్ల మార్కును దాటేసి యూఎస్ డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రీమియర్స్ ద్వారానే ఈ సినిమా మొదటి రోజు దాదాపు రూ. 40 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఉంటుందని సినిమా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానుల హంగామా మామూలుగా లేదు. థియేటర్లలో పేపర్లు ఎగరేస్తూ, పూల చల్లుతూ పండగ చేసుకుంటున్నారు. లాంగ్ రన్ లో ఈ చిత్రం మరిన్ని భారీ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తోంది.




