.webp)
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'టాక్సిక్'. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారు? అని ప్రశ్నిస్తూ ఆయన ఒక ప్రత్యేక వీడియోని విడుదల చేశారు. "నేను కూడా ఎంతో ఆసక్తితో టాక్సిక్ సినిమా చూద్దామని థియేటర్‌కు వెళ్లాను. కానీ అందులోని తీవ్రమైన అశ్లీలత, మితిమీరిన హింస చూసి తట్టుకోలేకపోయాను. భరించలేక సినిమా పూర్తి కాకుండానే మధ్యలోనే బయటకు వచ్చేశాను" అని సంచలన విషయాలు వెల్లడించారు.

దర్శకనిర్మాతలు కేవలం రక్తం చిందించే హింసను, అశ్లీలతను మాత్రమే నమ్ముకుని సినిమాలు తీయడం సరికాదని... సమాజానికి ఉపయోగపడే ధర్మాన్ని, భక్తిని, సామాజిక బాధ్యతను పెంపొందించే సినిమాలు తీయాలని ఆయన సినీ పరిశ్రమకు విజ్ఞప్తి చేశారు. యశ్ వంటి గ్లోబల్ ఇమేజ్ ఉన్న అగ్ర హీరోలు కుటుంబసమేతంగా అందరూ కలిసి కూర్చొని చూసేలాంటి మంచి కథలను ఎంచుకోవాలని హితవు పలికారు.
ఈ సందర్భంగా ఆయన ఇటీవలే వచ్చిన కొన్ని సినిమాలను ఉదాహరణగా చూపిస్తూ ప్రశంసలు కురిపించారు. రవితేజ నటించిన 'ఇరుముడి' చిత్రంలో ఆధ్యాత్మికత, సామాజిక స్పృహ చాలా అద్భుతంగా చూపించారని... అలాగే 'ఛావా' చిత్రంలో ధైర్యం, దేశభక్తి వంటి గొప్ప అంశాలను ప్రదర్శించారని కొనియాడారు. మన సినీ పరిశ్రమకు ఇప్పుడు ఇలాంటి ధర్మబద్ధమైన, సందేశాత్మక చిత్రాల అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.
[Toxic Movie, Controversy, Rocking Star Yash, Geetu Mohandas, MLA Raja Singh, Telugu Cinema News, Tollywood, Telugu News]





.webp)
