
మాధవన్(R Madhavan)యాక్టింగ్ కి ఉన్న క్యాపబిలిటీ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. తన అద్భుతమైన పెర్ఫార్మ్ తో సినిమా రేంజ్ ని పెంచడంలో దిట్ట. ధురంధర్ పార్ట్ 1 , పార్ట్ 2 లో పోషించిన అజయ్ సన్యాల్ క్యారక్టర్ నే రీసెంట్ ఉదాహరణ. ఇప్పుడు మరోసారి భారతదేశపు ఎడిసన్‌గా కీర్తించబడిన గొప్ప శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త గోపాల్‌స్వామి దొరైస్వామి నాయుడు (జి.డి. నాయుడు) జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో టైటిల్ రోల్ లో కనిపించనున్నాడు.
ఇటీవలే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. సదరు పోస్టర్‌లో మాధవన్ గెటప్‌లో కనిపిస్తూ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. 'బ్రిటిషర్లు భయపడిన.. సొంత దేశస్థులు మరచిపోయిన మహనీయుడు' అనే క్యాప్షన్‌తో వచ్చిన ఈ ఫస్ట్ లుక్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.
తాజాగా ఒక సాలిడ్ అప్‌డేట్‌ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ బయోపిక్ ప్రపంచవ్యాప్తంగా 2026 జూలై 17న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవల్‌లో ఐదు భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని వర్గీస్ మూలన్ పిక్చర్స్ సమర్పణలో, ట్రైకలర్ ఫిల్మ్స్ అసోసియేషన్‌తో కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం కోయంబత్తూరు పరిసర ప్రాంతాల్లోనే జరగడం విశేషం, ఎందుకంటే జి.డి. నాయుడు తన జీవితాన్ని, పరిశోధనలని అక్కడే సాగించారు.
ఈ బయోపిక్‌లో సత్యరాజ్, జయరామ్, ప్రియమణి, దుషారా విజయన్, తంబి రామయ్య, వినయ్ రాయ్,యోగి బాబు వంటి ప్రముఖ నటులు నటిస్తున్నారు. 'గోవింద్ వసంత' అందిస్తున్న సంగీతం, 'అరవింద్ కమలనాథన్' సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' వంటి జాతీయ అవార్డు గెలుచుకున్న బయోపిక్ తర్వాత మాధవన్ నటిస్తున్న మరో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్డ్ మూవీ కావడంతో అభిమానుల్లో,ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొని ఉంది.
Also read: రకుల్ ప్రీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒకసారి మోసం చేస్తే క్షమించాలా!
చిత్ర కథ విషయానికి వస్తే కేవలం మూడవ తరగతి వరకు మాత్రమే చదువుకుని, బస్సు క్లీనర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఒక సాధారణ వ్యక్తి.. భారతదేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్ ని కనిపెట్టే స్థాయికి ఎలా ఎదిగారు అనేదిగా ఉండబోతుంది. జి.డి. నాయుడు 1893లో కోయంబత్తూరు సమీపంలోని ఒక చిన్న గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. 1920లో ఒకే ఒక్క బస్సుతో రవాణా రంగాన్ని ప్రారంభించి, ఆ తర్వాత 1937లో నేషనల్ ఎలక్ట్రిక్ వర్క్స్ స్థాపించి అద్భుతాలు సృష్టించారు. 1967లో ఆయన స్థాపించిన సైన్స్ మ్యూజియం నేటికీ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.







