
సింగిల్ స్క్రీన్స్ కి పర్సెంటేజ్ విషయంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాన్ని తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) దృష్టికి తీసుకొచ్చారు. విషయాలన్నీ పూర్తిగా విన్న చిరంజీవి పరిశ్రమ లో భాగస్వాములయిన అందరికీ పూర్తి న్యాయం జరిగేలా వుండాలని, ఒక్క సినిమా గురించో, ఒక్క సెక్టార్ గురించో ఈ చర్చ కాదని, అందరికీ ఆమోదయోగ్యంగా వుండాలనే పరిశ్రమ కొన్ని పద్దతులను ఏర్పరుచుకుంది అన్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమకి హైయెస్ట్ బాడీ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్న విషయాన్ని గుర్తు చేసి, ఆ ఛాంబర్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి వుండటం అందరికీ సముచితం అన్నారు. ఒకసారి అందరినీ సంప్రదించి, పర్సెంటేజ్ మోడల్ మీద ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ ఛాంబర్ ఒక నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత దాన్ని వ్యతిరేకిస్తూ మీడియా ముందు ఏ ఒక్కరూ అభిప్రాయాలు వ్యక్తపరచటం తగదని అన్నారు. ఇలాంటి వాటివల్ల ఇండస్ట్రీ ఒక్కటిగా లేదన్న సందేశం ఇవ్వకూడదని అన్నారు.
ఇంతకు ముందు వేసిన వేరే కమిటీల పనితీరు, ఫలితాల పట్ల సింగిల్ స్క్రీన్స్ సభ్యులలో కొంత అసంతృప్తి, అపనమ్మకం వుందన్న విషయం అర్ధం అయిందన్నారు. ఈ సారి ఛాంబర్ ఏర్పాటు చేసిన కమిటీ అనుకున్న గడువులో అంటే జూన్ 30వ తేదీ వరకూ, అన్ని విషయాలని పూర్తిగా పరిశీలించి ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్ర్స్, ఎగ్జిబిటర్స్ అందరికీ న్యాయం జరిగేలా పర్సెంటేజ్ మోడల్ మీద ప్రతిపాదనని చేస్తుందని తనకు నమ్మకం వుందని, ఆ కమిటీ సకాలంలో తన బాధ్యతలు పూర్తిచేసి నివేదిక ఇవ్వటానికి తనవంతు కూడా పూర్తి ప్రయత్నం చేస్తానని చిరంజీవి హామీ ఇచ్చారు.
చిరంజీవి సమయం వెచ్చించి తమకున్న సమస్యలని, భయాలని, ప్రస్తుతం సింగిల్ స్క్రీన్స్ కి వున్న పరిస్థితులని అవగాహన చేసుకుని అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇవ్వటం పట్ల సభ్యులందరూ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. వారి అసోసియేషన్స్ లో వున్న మిగతా సభ్యులందరికి ఈ సమావేశం గురించి తెలియచేసి 24 గంటలలో తమ ఆమోదాన్ని తెలియచేస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో TFCC ప్రెసిడెంట్ సురేష్ బాబు, TFDC చైర్మన్ దిల్ రాజు, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, కేఎల్ నారాయణ, సునీల్ నారంగ్, భరత్ నారంగ్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.





