
టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. తూలికా తనిస్క్ క్రియేషన్స్ పతాకంపై 'పోలీస్ వారి హెచ్చరిక' చిత్రాన్ని నిర్మించడం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన నిర్మాత బెల్లి జనార్ధన్ (Belli Janardhan), స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు కన్నుమూశారు.
ఉగాది పండుగ జరుపుకోవడం కోసం అత్తగారి ఊరైన కట్టంగూరుకు తన కుటుంబసభ్యులతో కలిసి వెళ్ళిన బెల్లి జనార్ధన్.. మార్చి 22న ఆ గ్రామంలో గల స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు నీటి అడుగుకు బలంగా తల తగిలి తీవ్రంగా గాయమవడంతో అక్కడికక్కడే తుదిశ్వాస విడిచారు.
బెల్లి జనార్ధన్ మాజీ సైనికుడు కావడంతో.. మార్చి 23న ఆయన స్వగ్రామమైన నకిరేకల్ మండలంలోని పాలెం గ్రామంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.

నిర్మాత బెల్లి జనార్ధన్ ఆకస్మిక మరణం పట్ల 'పోలీస్ వారి హెచ్చరిక' చిత్ర దర్శకుడు బాబ్జీ సంతాపాన్ని తెలిపారు. "పోలీస్ వారి హెచ్చరిక సినిమా యూనిట్ తరుపున, వ్యక్తిగతంగా నా తరుపున నిర్మాత బెల్లి జనార్ధన్ గారి ఆకస్మిక మరణం పట్ల తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తపరుస్తూ వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలుపుకుంటున్నాము" దర్శకుడు బాబ్జీ పేర్కొన్నారు.





