
భారతీయ సినిమా పరిధి ప్రాంతీయ సరిహద్దులను దాటి ప్రపంచ స్థాయికి విస్తరించింది. ఒకప్పుడు కేవలం వంద కోట్ల కలెక్షన్లు సాధించడమే ఒక అద్భుతంగా భావించే రోజులు ఉండేవి. కానీ ఇప్పుడు, మొదటి రోజే ఏకంగా ₹100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించడం మన స్టార్ హీరోలకు ఒక సరికొత్త రికార్డు బెంచ్‌మార్క్‌గా మారింది. డే 1 వరల్డ్‌వైడ్ గ్రాస్ కలెక్షన్లలో ఈ ఘనత సాధించిన అగ్ర నటుల జాబితా ఇండస్ట్రీలో సరికొత్త సంచలనాలకు దారితీస్తోంది. ఈ రేసులో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఎవరికీ అందనంత ఎత్తులో అగ్రస్థానంలో నిలిచారు.
ప్రభాస్ నటించిన సినిమాల్లో ఏకంగా 6 చిత్రాలు మొదటి రోజే ₹100 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్త గ్రాస్ వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించాయి. బాహుబలి 2 చిత్రంతో మొదలైన ఈ రికార్డుల పరంపర సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 AD, ది రాజా సాబ్ చిత్రాల వరకు నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ భారీ రికార్డుతో ప్రభాస్ భారతీయ చిత్ర పరిశ్రమలోనే తిరుగులేని బాక్సాఫీస్ కింగ్‌గా అవతరించారు.
ప్రభాస్ తర్వాతి స్థానంలో దళపతి విజయ్, జూనియర్ ఎన్టీఆర్, షారూఖ్ ఖాన్, రామ్ చరణ్ తలో 2 సినిమాలతో నిలిచారు. దళపతి విజయ్ నటించిన లియో, గోట్ చిత్రాలు మొదటి రోజే ₹100 కోట్ల క్లబ్‌లో చేరాయి. జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్, దేవర సినిమాలతో ఈ ఘనత సాధించారు. బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ పఠాన్, జవాన్ చిత్రాలతో తన సత్తా చాటారు. ఇక 'ఆర్ఆర్ఆర్'తో ఒకసారి ఈ ఘటన సాధించిన రామ్ చరణ్, ఇప్పుడు 'పెద్ది'(Peddi)తో మరోసారి సంచలనం సృష్టించారు. ఈ సినిమా మొదటిరోజు రూ.130 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టడం విశేషం.
ఇక కేవలం ఒక సినిమాతో ఈ మైలురాయిని అందుకున్న స్టార్ హీరోల జాబితా కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సంచలన చిత్రం పుష్ప 2 ది రూల్ తో మొదటి రోజే ₹100 కోట్ల కలెక్షన్ల రికార్డును బద్దలు కొట్టారు. బాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రణ్‌వీర్ సింగ్ ధురంధర్ ది రివెంజ్ చిత్రంతో, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రంతో ఈ క్లబ్‌లో స్థానం సంపాదించారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ చిత్రంతో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ (OG) చిత్రంతో మరియు బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ యానిమల్ చిత్రంతో మొదటి రోజే ₹100 కోట్ల మార్క్‌ను దాటి బాక్సాఫీస్ దగ్గర తమ మాస్ పవర్‌ను నిరూపించుకున్నారు. ఈ గణాంకాలు భారతీయ సినిమా మార్కెట్ ఎంత భారీగా విస్తరించిందో స్పష్టం చేస్తున్నాయి.






