
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన దృశ్యకావ్యం 'బాహుబలి'. సరికొత్త రికార్డులను సృష్టించిన ఈ సినిమా, ఇప్పుడు మరో అంతర్జాతీయ వేదికపై భారత్ గర్వపడేలా మెరిసింది. ఫ్రాన్స్‌లో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న యాన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026 (Annecy International Animation Film Festival 2026) లో 'బాహుబలి: ది ఎటర్నల్ వార్' (Baahubali The Eternal War) అధికారికంగా ఎంపికైంది. ఈ ప్రతిష్టాత్మక ఉత్సవాల్లోని 'వర్క్ ఇన్ ప్రోగ్రెస్' (Work in Progress) సెషన్స్‌లో ఈ ప్రాజెక్ట్‌ను ప్రదర్శించడం విశేషం. ఈ అద్భుతమైన విషయాన్ని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
ప్రభాస్ (Prabhas) తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఈ అంతర్జాతీయ గౌరవం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. "యాన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026 లోని వర్క్ ఇన్ ప్రోగ్రెస్ సెషన్స్‌లో 'బాహుబలి: ది ఎటర్నల్ వార్' ప్రాజెక్ట్ ప్రాతినిధ్యం వహించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. టీమ్ నిజంగా ఒక అద్భుతమైన మరియు ఎంతో ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టిస్తోంది. ఈ విజువల్ వండర్‌ను ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడు చూస్తుందా అని నేను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను" అంటూ ప్రభాస్ రాసుకొచ్చారు.
ఈ సందర్భంగా ఒక ప్రత్యేక పోస్టర్ ను కూడా ప్రభాస్ పంచుకున్నారు. పోస్టర్‌లో బాహుబలి శివలింగం ముందు నిలబడి రౌద్ర రూపంతో యుద్ధ ముద్రలో ఉన్న యానిమేషన్ లుక్ ప్రేక్షకులలో, ముఖ్యంగా డార్లింగ్ అభిమానులలో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది.
ఈ యానిమేషన్ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఇషాన్ శుక్లా దర్శకత్వం వహిస్తుండగా, ఎస్ఎస్ రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.
భారతీయ యానిమేషన్ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేలా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. ప్రతిష్టాత్మకమైన యాన్సీ ఫెస్టివల్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద యానిమేషన్ ఉత్సవంగా గుర్తింపు పొందింది. అలాంటి గ్లోబల్ వేదికపై బాహుబలి సిరీస్ నుండి వస్తున్న ఈ యానిమేషన్ చిత్రం ప్రదర్శితమవ్వడం యావత్ టాలీవుడ్ గర్వించదగ్గ పరిణామం. ప్రభాస్ చేసిన ఈ వైరల్ పోస్ట్ ద్వారా బాహుబలి బ్రాండ్ వాల్యూ అంతర్జాతీయ మార్కెట్‌లో ఎంత బలంగా ఉందో మరోసారి నిరూపితమైంది.






