ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమా టీజర్ వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్ర చిత్రణపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నేతాజీకి మనవడి వరుసయ్యే చంద్రకుమార్ బోస్ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాశారు. టీజర్‌లో చరిత్రను వక్రీకరించేలా సన్నివేశాలు ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న విడుదలైన ‘ఫౌజీ’ టీజర్‌లో 1942 నాటి బెర్లిన్ నేపథ్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్, జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ మధ్య సంభాషణను చూపించారు. ఈ సన్నివేశంలో నేతాజీ.. ‘ఫౌజీ’లోని కల్పిత పాత్ర గురించి ప్రస్తావించినట్లు కనిపిస్తుంది. నిజమైన చారిత్రక వ్యక్తిని కల్పిత పాత్రను పరిచయం చేయడానికి ఉపయోగించడం సరికాదని, దీనివల్ల నేతాజీ వారసత్వాన్ని తక్కువ చేసినట్లవుతుందని చంద్రకుమార్ బోస్ అభ్యంతరం తెలిపారు.
ఈ అంశంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు రాసిన లేఖలో టీజర్‌ను పరిశీలించి, దీనిపై విచారణ జరిపించాలని ఆయన కోరారు. అభ్యంతరకరమైన కంటెంట్‌కు సెన్సార్ బోర్డు ఎలా అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు. టీజర్‌ను వెంటనే తొలగించి, చారిత్రక అంశాలను సరిచేసిన తర్వాత మళ్లీ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. బాధ్యులైన సెన్సార్ బోర్డు సభ్యులపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ లేఖ ప్రతిని ప్రధాని నరేంద్ర మోదీకి కూడా పంపించారు.
అయితే, ప్రభాస్‌పై కానీ, చిత్రబృందంపై వ్యక్తిగతంగా వ్యతిరేకత లేదని.. నేతాజీకి సంబంధించిన చారిత్రక అంశాలను గౌరవంగా చూపించాలన్నదే తమ ఉద్దేశమని చంద్రకుమార్ బోస్ తన అభిప్రాయాల్లో స్పష్టం చేశారు. సమస్యను పరిష్కరించి టీజర్‌లో అవసరమైన మార్పులు చేస్తే ప్రభాస్, చిత్రబృందానికి తన శుభాకాంక్షలు ఉంటాయని తెలిపారు. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘ఫౌజీ’ 2027 మార్చి 19న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. ఈ వివాదంపై చిత్రబృందం స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
[Prabhas Fauzi, Fauzi Teaser Controversy, Chandra Kumar Bose, Netaji Subhas Chandra Bose, Hanu Raghavapudi, Fauzi Movie News, Prabhas Upcoming Movie]




.webp)

