పహల్గామ్ ఉగ్రదాడి ఎఫెక్ట్.. చిక్కుల్లో ప్రభాస్ మూవీ!
on Apr 23, 2025
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్(Pahalgam)లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ దాడి వెనుక పాకిస్తాన్ ఉందన్న వార్తల నేపథ్యంలో భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి సరైన బుద్ధి చెప్పాలని కోరుతున్నారు. ఇదే సమయంలో పాకిస్తాన్ కి చెందిన నటీనటులు భాగమైన సినిమాలను ఇండియాలో బ్యాన్ చేయాలనే డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి.
పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన హిందీ చిత్రం 'అబిర్ గులాల్' మే 9న విడుదల కావాల్సి ఉండగా, దీనిని బ్యాన్ చేయాలని సోషల్ మీడియా వేదికగా నెటిజెన్లు పిలుపునిస్తున్నారు. అంతేకాదు, ఈ బ్యాన్ ప్రభావం ప్రభాస్ (Prabhas) నటిస్తున్న 'ఫౌజి'ని కూడా తాకేలా ఉంది.
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఫౌజి'. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీలో ఇమాన్వీ ఇస్మాయిల్ (Imanvi Ismail) హీరోయిన్. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన ఈమె.. ఏకంగా ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇమాన్వీని 'ఫౌజి' చిత్రం నుంచి తొలగించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
ఇమాన్వీ కుటుంబం పాకిస్తాన్ లోని కరాచీకి చెందినది. అంతేకాదు, ఆమె తండ్రి ఇక్బాల్ ఇస్మాయిల్ ఖాన్ పాకిస్తాన్ సైనిక అధికారి. ఇదే ఇప్పుడు భారతీయుల ఆగ్రహానికి కారణమైంది. ఇమాన్వీని 'ఫౌజి' నుంచి హీరోయిన్ గా తొలగించాలని పలువురు కోరుతున్నారు. లేదంటే సినిమాని బాయ్ కాట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరి ఈ వివాదంపై 'ఫౌజి' టీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
