Home

»

Latest News

Peddi: గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రామ్ చరణ్ సంచలనం.. రిలీజ్‌కు ముందే 'పెద్ది' రికార్డు!

Jun 3, 2026 9:00AM

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan) గ్లోబల్ రేంజ్ క్రేజ్ మరోసారి అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద ఘనంగా నిరూపితమవుతోంది. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో, రామ్ చరణ్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘పెద్ది’ (Peddi) ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మోస్ట్ అవేటెడ్ సినిమా జూన్ 4న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, ఓవర్సీస్ మార్కెట్‌లో మాత్రం ఒక రోజు ముందుగానే, అంటే జూన్ 3నే ప్రీమియర్ షోల రూపంలో సందడి చేయనుంది. అయితే, సినిమా థియేటర్లలోకి అడుగుపెట్టడానికి ముందే బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ప్రారంభించి, ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

నార్త్ అమెరికా వ్యాప్తంగా ‘పెద్ది’ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ ప్రీ-బుకింగ్స్ విండో ఓపెన్ అయినప్పటి నుంచి టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అమెరికా, కెనడాలోని మెగా అభిమానులు, సినీ ప్రియులు ఈ సినిమాను చూసేందుకు విపరీతమైన ఆసక్తిని కనబరుస్తుండటంతో బుకింగ్స్ ఊపందుకున్నాయి. ఈ క్రేజ్ ఏ స్థాయికి చేరిందంటే, కేవలం అడ్వాన్స్ ప్రీ-సేల్స్ ద్వారానే నార్త్ అమెరికాలో ఏకంగా 1 మిలియన్ డాలర్ల ($1 Million) గ్రాస్ మార్కును సునాయాసంగా దాటేసింది.

రిలీజ్‌కు ముందే అత్యంత ప్రతిష్టాత్మకమైన వన్ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ‘పెద్ది’ సినిమా చేరడం సాధారణ విషయం కాదు. గ్లోబల్ వైడ్‌గా సంచలనం సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా తర్వాత, ప్రీమియర్స్ కలెక్షన్ల పరంగానే రామ్ చరణ్ కెరీర్‌లో 1 మిలియన్ డాలర్ల మార్కును అందుకున్న చిత్రంగా ‘పెద్ది’ నిలవడం విశేషం. 

సినిమా కథాంశంపై ఉన్న నమ్మకం, బుచ్చిబాబు మేకింగ్ స్టైల్, రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ స్థాయి అంచనాలకు కారణమని సినీ వర్గాలు అంటున్నాయి. నేడు(జూన్ 3) ప్రీమియర్స్ సమయానికి ఈ నంబర్లు మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

భారతీయ సినిమా మార్కెట్‌లో ఓవర్సీస్ వసూళ్లు కీలక పాత్ర పోషిస్తున్న ఈ రోజుల్లో, ప్రీ-సేల్స్ లోనే మిలియన్ డాలర్లు సాధించడం సినిమాపై ఉన్న హైప్‌కు నిదర్శనం. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్డమ్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎంతగా పెరిగిందో ఈ ప్రీ-సేల్స్ ట్రెండ్ స్పష్టం చేస్తోంది. 

వృద్ధి సినిమాస్ నిర్మించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఈ క్రేజ్ చూస్తుంటే జూన్ 4న థియేటర్లలోకి వచ్చే సరికి బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' ఎలాంటి సునామీ సృష్టిస్తుందోనని ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com