
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'పెద్ది' (Peddi) మూవీ షూటింగ్ అధికారికంగా పూర్తయ్యింది. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ బడ్జెట్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సోషల్ మీడియా వేదికగా షూటింగ్ పూర్తయినట్లు ప్రకటించారు.
రత్నవేలు ఎమోషనల్ పోస్ట్
షూటింగ్ ముగిసిన సందర్భంగా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తన ఎక్స్ (X) ఖాతాలో చరణ్‌తో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. "పెద్ది షూటింగ్ పూర్తయ్యింది.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఈ ప్రయాణం ఒక మధుర జ్ఞాపకం. స్క్రీన్ మీద ఆయన పవర్ హౌస్ పెర్ఫార్మర్ అయితే, బయట చాలా మంచి స్నేహితుడు" అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. చివరి రోజు చరణ్‌పై ఒక భారీ పాటను చిత్రీకరించినట్లు సమాచారం.
ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక పవర్‌ఫుల్ కుస్తీ యోధుడిగా కనిపించబోతున్నారు. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
రిలీజ్ డేట్ అప్‌డేట్
పెద్ది సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయాలని భావించినప్పటికీ.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం చిత్ర బృందం దీనిని జూన్ కి వాయిదా వేసింది. ఈ రోజు కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. పెద్ది సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.






