తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన క్లాసిక్ ముద్ర వేసుకున్న సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ తాజాగా ఇండస్ట్రీలో ఒక రేంజ్ వివాదానికి తెరలేపారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ 'పెద్ది' సినిమాపై ఆయన చేసిన కొన్ని బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సినిమా మేకింగ్ స్టైల్‌ను విమర్శిస్తూనే, డైరెక్టర్ బుచ్చిబాబు తన సినిమా సీన్‌ను కాపీ కొట్టారంటూ నేరుగా ఆరోపణలు గుప్పించారు.
గీతాకృష్ణ ఒక తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'పెద్ది' సినిమాలో హీరోయిన్ తనకు తానుగా తాళి కట్టుకునే అత్యంత కీలకమైన సన్నివేశం, 1989లో తాను రూపొందించిన ఎమోషనల్ క్లాసిక్ హిట్ 'కోకిల' చిత్రం నుండి తీసుకున్నదేనని బాంబ్ పేల్చారు. ఆ సీన్‌ను బుచ్చిబాబు యాజిటీజ్‌గా దించేశాడంటూ నిర్మొహమాటంగా మాట్లాడారు.
కేవలం కాపీ వివాదంతోనే ఆగకుండా సినిమా కథనంపై కూడా ఆయన తనదైన శైలిలో విశ్లేషణ చేశారు. 'పెద్ది' చిత్రాన్ని ఒక పక్కా కమర్షియల్ బయోపిక్‌గా ప్రెజెంట్ చేయడంలో చిత్రబృందం విఫలమైందని, సినిమా చూస్తుంటే ఒక డాక్యుమెంటరీ చూస్తున్న ఫీలింగ్ కలిగిందని అన్నారు. కథలో స్పష్టమైన ఫార్మాట్ లేకపోవడం సాధారణ ప్రేక్షకుడికి కనెక్ట్ కాకుండా చేసిందని, బాక్సాఫీస్ ఫార్ములాను మిస్ అవ్వడం ఈ చిత్రానికి మైనస్ అయిందని అభిప్రాయపడ్డారు.
ఇక ఈ సినిమాలో నటించిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతూ.. ఆ పాత్ర కోసం ఆమె చాలా కష్టపడిన మాట వాస్తవమే అయినా, గ్రూమింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిందని అన్నారు. ఒకవేళ షూటింగ్ సమయంలోనే తనను సంప్రదించి ఉంటే ఆ క్యారెక్టర్‌ను మరింత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు గైడెన్స్ ఇచ్చేవాడినని, అయితే తన రెమ్యునరేషన్ కాస్త ఎక్కువే ఉంటుందంటూ నవ్వుతూ చమత్కరించారు.
దర్శక దిగ్గజం కె. విశ్వనాథ్ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన గీతాకృష్ణ.. నాగార్జున హీరోగా వచ్చిన 'సంకీర్తన' చిత్రంతో ఉత్తమ నూతన దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ఆయన అందించిన కోకిల, కీచురాళ్ళు, ప్రియతమ వంటి చిత్రాలు సంచలన విజయాలు సాధించాయి. నిఖార్సైన విమర్శలు చేసే ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి.
గీతాకృష్ణ చేసిన ఈ కాపీ ఆరోపణలు, డాక్యుమెంటరీ విమర్శలపై 'పెద్ది' చిత్రబృందం గానీ, దర్శకుడు బుచ్చిబాబు గానీ ఎలా స్పందిస్తారో.. ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి మరి!




