
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నయా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi) బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే వసూళ్ల వేటను ప్రారంభించింది. ముఖ్యంగా మొదటి వారాంతంలో ఈ సినిమా సాధించిన వసూళ్లు ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. శనివారంతో పోలిస్తే ఆదివారం నాడు కలెక్షన్లలో భారీ వృద్ధి కనిపించింది. ఆదివారం దేశవ్యాప్తంగా థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడాయి. తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన ఆక్యుపెన్సీ నమోదు కావడంతో బాక్సాఫీస్ వద్ద 'పెద్ది'గాడి ఊచకోత స్పష్టంగా కనిపిస్తోంది.
నాలుగో రోజైన ఆదివారం నాడు ‘పెద్ది’ చిత్రం ఇండియాలో ఏకంగా రూ. 31.90 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. అంతకుముందు రోజు అంటే శనివారం వచ్చిన రూ. 28.85 కోట్లతో పోలిస్తే ఇది ఏకంగా 10.6 శాతం వృద్ధిని చూపిస్తోంది. ఈ ఆదివారం నాటి బూస్ట్‌తో కేవలం నాలుగు రోజుల్లోనే ఇండియాలో మొత్తం నెట్ వసూళ్లు రూ. 157.15 కోట్లకు చేరుకున్నాయి. భారతదేశం వ్యాప్తంగా ఈ నాలుగు రోజుల్లో సాధించిన గ్రాస్ కలెక్షన్లు రూ. 187.02 కోట్లుగా నమోదయ్యాయి.
అయితే, ఓవర్సీస్ మార్కెట్‌లో మాత్రం ఈ సినిమా కలెక్షన్లలో కొంత తగ్గుదల కనిపిస్తోంది. ఆదివారం నాడు ఓవర్సీస్ మార్కెట్ నుంచి కేవలం రూ. 4 కోట్ల గ్రాస్ మాత్రమే లభించింది. అయినప్పటికీ, ఇప్పటివరకు అక్కడ సాధించిన మొత్తం వసూళ్లు రూ. 46 కోట్ల గ్రాస్‌కు చేరుకున్నాయి. ఇండియా మరియు ఓవర్సీస్ కలెక్షన్లను కలుపుకుంటే, ‘పెద్ది’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 233.02 కోట్ల భారీ గ్రాస్ కలెక్షన్లను కొల్లగొట్టింది.
ఈ భారీ వసూళ్లతో రామ్ చరణ్ తన కెరీర్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఆయన నటించిన చిత్రాలలో రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరిన మూడో చిత్రంగా ‘పెద్ది’ నిలిచింది. అంతకుముందు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రాలతో చరణ్ ఈ మైలురాయిని దాటారు. అంతేకాకుండా, సోలో హీరోగా మొదటి రోజే రూ. 100 కోట్ల మార్కును అందుకున్న 11వ తెలుగు సినిమాగా ‘పెద్ది’ సరికొత్త చరిత్ర సృష్టించింది.






