
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలు అభిమానులను కాస్త ఆందోళనకు గురిచేశాయి. అయితే, తాజాగా ఆయన ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ఆసుపత్రి నుంచి శస్త్రచికిత్స అనంతరం విజయవంతంగా డిశ్చార్జ్ అయ్యారనే వార్త అభిమానులకు ఊరటనిస్తోంది. గత కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్న ఆయనకు, వైద్యులు విజయవంతంగా సర్జరీ పూర్తి చేయడంతో ఇప్పుడు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఈ పరిణామం పట్ల ఆయన సతీమణి అన్నా లెజినోవా సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఒక భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
తమ కుటుంబం హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయాయని, ఎట్టకేలకు ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని అన్నా లెజినోవా పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపి, ఎంతో నైపుణ్యం, బాధ్యతతో ఈ శస్త్రచికిత్సను పూర్తి చేసిన వైద్య బృందానికి ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఆయన సురక్షితమైన చేతుల్లో ఉన్నారనే నమ్మకం తమ కుటుంబానికి ఎంతో ప్రశాంతతను ఇచ్చిందని ఆమె వెల్లడించారు. వైద్య నైపుణ్యంతో పాటు, కష్ట సమయంలో వైద్యులు చూపిన అంకితభావం, మానవత్వానికి తమ కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని ఆమె రాసుకొచ్చారు.
Pawan Kalyan, Anna Lezhneva, Instagram





