- పవన్ కల్యాణ్ పొలిటికల్ డ్రామా
- ఎ.ఎం.రత్నం సెన్సేషనల్ కామెంట్స్
- జనసేనాని డ్రీమ్ ప్రాజెక్ట్ బ్యాక్‌స్టోరీ
టాలీవుడ్ ‘పవర్ స్టార్’ నుంచి నేడు ఆంధ్రప్రదేశ్ ‘డిప్యూటీ సీఎం’ వరకు పవన్ కల్యాణ్ ప్రస్థానం ఒక సంచలనం. అయితే, ఆయన సినీ కెరీర్‌లో ఎంతో ఆసక్తి రేకెత్తించి, చివరి నిమిషంలో ఆగిపోయిన సినిమా ఏదైనా ఉందంటే అది ‘సత్యాగ్రహి’ మాత్రమే. దశాబ్ద కాలం క్రితమే పవన్ కల్యాణ్ మెగాఫోన్ పట్టి, ఒక పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాను తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. కానీ అట్టహాసంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ అనూహ్యంగా అటకెక్కింది. తాజాగా ఈ సినిమా ఆగిపోవడానికి గల అసలు కారణాలను ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం వెల్లడించారు.
రెండు దశాబ్దాల క్రితం 'ఖుషి' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కల్యాణ్ తన స్వీయ దర్శకత్వంలో ‘జానీ’ సినిమా చేశారు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో పవన్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఆ సమయంలోనే ఏఎం రత్నం నిర్మాణంలో ‘సత్యాగ్రహి’ అనే భారీ పొలిటికల్ మూవీని అనౌన్స్ చేశారు. అప్పట్లో ఈ సినిమా పోస్టర్లు, పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ లుక్స్ చూసి అభిమానులు పూనకాలతో ఊగిపోయారు. దేశభక్తి, సామాజిక బాధ్యత నేపథ్యంలో సాగే ఈ కథను పవన్ స్వయంగా సిద్ధం చేసుకున్నారు.
కానీ, ‘జానీ’ రిజల్ట్ పవన్ కల్యాణ్‌ను బాగా ఆలోచింపజేసింది. నిర్మాత ఏఎం రత్నంకు తన వల్ల నష్టం కలగకూడదని పవన్ భావించారట. సరైన స్క్రిప్ట్ వర్క్ పూర్తికాకపోవడం, మరోవైపు తన దర్శకత్వ ప్రతిభపై తనకే సందేహాలు కలగడంతో ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టాలని పవనే స్వయంగా నిర్ణయించుకున్నారని ఏఎం రత్నం ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ఒకవేళ ఆ సినిమా గనుక పూర్తి చేసి ఉంటే, పవన్ కల్యాణ్ బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తరహాలో సామాజిక స్పృహ ఉన్న సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలోనే కొనసాగేవారని, రాజకీయాల వైపు వచ్చే వారు కాదేమోనని పవన్ తనతో అన్నట్లు రత్నం తెలిపారు.
ముఖ్యంగా జయప్రకాష్ నారాయణ్ గారూ చేపట్టిన అత్యవసర పరిస్థితి ఉద్యమ స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందించాలని పవన్ సంకల్పించారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను సినిమాల ద్వారా కాకుండా, ప్రత్యక్షంగా పోరాడితేనే మార్పు వస్తుందని ఆయన నమ్మారు. బహుశా అదే ఆలోచన ఆయనను సినిమాల నుంచి ప్రత్యక్ష రాజకీయాల వైపు నడిపించిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పట్లో ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాల్సి ఉండటం విశేషం.






