
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. మొదట మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ప్రేక్షకులకు పరిచయమైన పవన్.. ఆ తర్వాత తన టాలెంట్ తో పవర్ స్టార్ గా ఎదిగారు. ఈ జెనరేషన్ లో ఏ హీరోకి సాధ్యం కానంత క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో వరుస హిట్స్ లో యూత్ లో ఫాలోయింగ్ దక్కించుకున్న పవన్.. ఆ తర్వాత జయాపజయాలతో సంబంధం లేకుండా తన ఫాలోయింగ్ ని అసాధారణ స్థాయిలో పెంచుకున్నారు. అయితే హీరోగా ఎన్నో హైట్స్ ని చూసిన పవన్ డైరెక్టర్ గానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయారు.
నేడు(సెప్టెంబర్ 2) పవన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన దర్శకత్వంలో వచ్చిన ఒకే ఒక్క సినిమాని ఓసారి గుర్తు చేసుకుందాం. పవన్ హీరోగా నటించిన 'జాని' సినిమా ఏప్రిల్ 25, 2003 న విడుదలైంది. ఈ సినిమాతోనే పవన్ దర్శకుడిగా మారారు. 'ఖుషి' వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో జానిపై విడుదల సమయంలో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో జాని విఫలమైంది. అయితే ఈ సినిమా పరాజయం పాలైనప్పటికీ ఈ సినిమాని అభిమానించే వాళ్ళు ఎందరో ఉన్నారు. రెగ్యులర్ గా కాకుండా పవన్ సినిమాను కొత్తగా ప్రెజెంట్ విధానం ఆకట్టుకుంది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇక ఈ సినిమాతో పవన్ అప్పట్లో ట్రెండ్ సెట్ చేశారనే చెప్పాలి. విడుదల సమయంలో పవన్ స్టైల్ ని అప్పట్లో యూత్ తెగ ఫాలో అయ్యారు. మొత్తానికి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలైనప్పటికీ.. కొందరిని మాత్రం మెప్పించింది.
దర్శకుడిగా మొదటి సినిమాతో విజయాన్ని అందుకోలేకపోయిన పవన్.. 2006 లో దర్శకుడిగా 'సత్యాగ్రహి' అనే సినిమాను ప్రకటించారు. ఈ సినిమా అప్పట్లో లాంచనంగా ప్రారంభమైంది. ఇందులో వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపే స్టూడెంట్ లీడర్ పాత్రలో పవన్ కనిపిస్తానని పవన్ తెలిపారు. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ ఆశలను నిరాశలు చేస్తూ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. ఎప్పటికైనా ఈ సినిమా పవన్ చేయాలని కోరుకునే అభిమానులు ఇప్పటికీ ఉన్నారు. మరి దర్శకుడిగా మొదటి సినిమాతో విజయాన్ని అందుకోలేకపోయిన పవన్.. దర్శకుడిగా రెండో సినిమా ఎప్పుడు చేస్తారో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.






