బుల్లితెర ప్రేక్షకాదరణ పొందిన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఢీ' ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ (జి.షణ్ముఖ) తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. విశాఖపట్నం జిల్లా పరిధిలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఆయన రెండు కాళ్లకు బలమైన గాయాలయ్యాయి. ఈ దురదృష్టకర సంఘటన బుల్లితెర వర్గాలతో పాటు ఆయన అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
వివరాల్లోకి వెళితే.. అనకాపల్లికి చెందిన ఓ డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి పండు మాస్టర్ భీమిలి సమీపంలోని తగరపువలసలో జరిగిన ఒక సాంస్కృతిక వేడుకలో పాల్గొన్నారు. అక్కడ ప్రదర్శన ముగించుకుని తమ బృందంతో కలిసి కారులో తిరుగుపయనమయ్యారు. మార్గమధ్యంలో ఆనందపురం మండలం లొడగలవానిపాలెం వద్ద కారులోని ఒక మహిళా డ్యాన్సర్‌కు వాంతులు అవ్వడంతో వాహనాన్ని రోడ్డు పక్కన ఆపారు. కారు దిగిన పండు మాస్టర్ మరికొందరు సభ్యులతో కలిసి వాహనం వెనుక భాగంలో నిలబడ్డారు.
అదే సమయంలో జాతీయ రహదారిపై అతివేగంగా దూసుకొచ్చిన ఒక బొలెరో వాహనం, ఆగి ఉన్న వీరి కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. డ్రైవర్ నిద్రమత్తు, నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు వెనుక నిల్చున్న పండు మాస్టర్‌తో పాటు లిఖిత ప్రియ, హారిక అనే మరో ఇద్దరు నృత్యకారులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే తోటి సభ్యులు వారిని విశాఖపట్నంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు.
ఈ సంఘటనపై స్పందించిన ఆసుపత్రి వైద్యులు పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఈ ప్రమాదంలో ఆయన రెండు కాళ్ల ఎముకలు ఫ్రాక్చర్ అయ్యాయని వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నామని, త్వరలోనే రెండు కాళ్లకు సర్జరీ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆపరేషన్ అనంతరం ఆయన పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఆరు నెలల పాటు బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు స్పష్టం చేశారు.
ఈ ప్రమాద వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు, పలువురు బుల్లితెర సెలబ్రిటీలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆనందపురం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డ్యాన్స్‌నే ప్రాణంగా భావించే పండు మాస్టర్ త్వరగా కోలుకుని, మళ్లీ ఎప్పటిలాగే స్టేజ్‌పై తన మార్క్ పర్ఫార్మెన్స్‌తో అలరించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.




