Home

»

Latest News

Pandu Master: యాక్సిడెంట్ కి గురైన పండు మాస్టర్‌కి అండగా ఎమ్మెల్యే సాబ్.. ఖర్చు గురించి ఆలోచించొద్దు

Jun 5, 2026 11:24AM

 


కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ (షణ్ముఖ) ఇటీవల విశాఖపట్నం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ విషాద వార్త తెలియగానే పలు సినీ,టివి నటులతో పాటు ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకి  గురయ్యారు. 

ప్రస్తుతం విశాఖపట్నంలోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో పండు మాస్టర్‌(Pandu Master)కి  అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ కష్టసమయంలో పండు మాస్టర్ కుటుంబానికి రాజకీయ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా గాజువాక టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మానవత్వం చాటుకుంటూ ఆపద్బాంధవుడిగా ముందుకొచ్చారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, పండు మాస్టర్ సన్నిహితులతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. శస్త్రచికిత్సలకి, తదుపరి వైద్య సంరక్షణకి అయ్యే ఖర్చుల గురించి ఎంతమాత్రం ఆందోళన చెందవద్దని, ఆ ఖర్చులన్నీ తానే అరేంజ్ చేస్తానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చూపిన ఈ గొప్ప ఉదారతపై నెటిజన్లు, సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పల్లా శ్రీనివాసరావు(Palla Srinivasarao) తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడుగా కూడా ఉన్నారు.

పండు ఆరోగ్య పరిస్థితిపై వైద్య బృందం అధికారికంగా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఈ ప్రమాదంలో పండు మాస్టర్ రెండు కాళ్లకు అత్యంత తీవ్రమైన గాయాలయ్యాయని, ముఖ్యంగా నడుము కింది భాగంలో ఎడమ తుంటి ఎముక  పూర్తిగా డిస్‌లొకేట్ అవ్వడంతో పాటు మోకాళ్ల కింద ఉండే కీలకమైన టిబియా, ఫిబులా ఎముకలు, జాయింట్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. అయితే అభిమానులకి  ఊరటనిచ్చే అతిపెద్ద విషయం ఏమిటంటే ప్రమాదం జరిగిన వెంటనే తగిన వైద్యం అందడం వల్ల పండు మాస్టర్‌కి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు స్పష్టం చేశారు. కారు టైరు ఆయన నడుము మీదుగా కాకుండా, కేవలం తొడలు, కాళ్ల మీదుగా వెళ్లడం వల్ల నరాలకు ఎలాంటి నష్టం జరగలేదని, ప్రస్తుతం ఆయన కాళ్లు చేతులు బాగానే ఆడిస్తున్నారని డాక్టర్లు చెప్తున్నారు.

Also read: Vijay: జననాయగన్ లీక్ కేసులోని నిందితులపై కోర్టు సంచలన నిర్ణయం


ఇప్పటికే వైద్యులు అత్యంత క్లిష్టమైన సర్జరీల ద్వారా జారిపోయిన తుంటి ఎముకను తిరిగి యథాస్థానానికి చేర్చారు. ఒక డ్యాన్సర్‌గా కెరీర్‌లో ఎదగాల్సిన పండు మాస్టర్‌కు ఈ గాయాలు పెద్ద దెబ్బే అయినప్పటికీ, తగిన సమయంలో సర్జరీ జరగడం వల్ల భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఆయన ఎముకలు పూర్తిగా అతుక్కుని, పాత స్థితికి రావడానికి కనీసం 4 నుంచి 6 నెలల పాటు పూర్తి బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్లు స్పష్టం చేశారు. ఈ 6 నెలల విశ్రాంతి మరియు సుదీర్ఘమైన ఫిజియోథెరపీ చికిత్సల అనంతరం, పండు మాస్టర్ మళ్లీ సాధారణ జీవితాన్ని గడుపుతూ, ఎప్పటిలాగే స్టేజ్ పై డ్యాన్స్ ప్రదర్శనలు కూడా ఇవ్వగలరని వైద్యులు ధీమా వ్యక్తం చేశారు.

 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com