Home

»

Latest News

శంకర మూవీ రివ్యూ

Oct 21, 2016

ఆల‌స్యం అమృతం విష‌యం అంటారు. ఈ సామెత సినిమాల‌కూ వ‌ర్తిస్తుంది. ఎప్ప‌టి క‌ప్పుడు వేడి వేడిగా వ‌డ్డించేస్తేనే రుచి. ఆగి.. ఆగి.. మెల్ల‌మెల్ల‌గా ల్యాబుల్లోంచి బ‌య‌ట‌ప‌డి, విడుద‌ల‌కు ముందు నానా ఇబ్బందులు ప‌డిన సినిమాలు స‌రిగా ఆడిన దాఖ‌లాలు టాలీవుడ్‌లోనే లేవు. శంక‌ర కూడా ఇలాంటి బాలారిష్టాల‌ను చాలా దాటుకొని వ‌చ్చింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది?  నెగిటీవ్ సెంటిమెంట్‌ని క్రాస్ చేసిందా?  లేదంటే... పాత సెంటిమెంట్‌నే కొన‌సాగించిందా?  నారా రోహిత్ క‌థానాయ‌కుడిగా న‌టించిన శంక‌ర రిపోర్ట్ ఏమిటి?  రివ్యూ ఎలా ఉంది?  తెలుసుకొంటే..


* క‌థ‌:
శంక‌ర (నారా రోహిత్‌) ఓ సిన్సియ‌ర్ స్టూడెంట్‌. త‌న క‌ళ్ల ముందు అన్యాయం జ‌రుగుతుంటే చూస్తూ ఊరుకోడు. సామాజిక దృక్ప‌థం కూడా ఎక్కువే. మ‌ర‌ద‌లు అన‌న్య (రెజీనా) అంటే చాలా ఇష్టం. స్టూడెంట్స్‌కీ  ఏసీపీ (జాన్ అజ‌య్‌)కీ జ‌రిగిన పోరాటంలో... ఏసీపీని ఎదిరిస్తాడు.  కోట్ల‌తో ముడిప‌డిన ఓ స్కామ్‌లో ఏసీపీతో పాటు మ‌రో మ‌గ్గురు పోలీసుల‌కు సంబంధం ఉంటుంది. దానికి సంబంధించిన ఆధారం.. ఓ వేశ్య ద‌గ్గ‌ర ఉంటుంది. అది చూపించి ఆ  కోట్ల‌న్నీ త‌న సొంతం చేసుకోవాల‌నుకొంటుందామె. అయితే... అనూహ్యంగా హ‌త్య‌కు గుర‌వుతుంది. ఆ సాక్ష్యం.. అనుకోకుండా శంక‌ర చేతికి చిక్కుతుంది.  అందులో ఏమున్న‌దో తెలుసుకొనే లోగా.. పోలీసులు శంక‌ర‌ని తీసుకెళ్లిపోతారు. నిర్మానుష్య ప్ర‌దేశానికి తీసుకెళ్లి ఎన్‌కౌంట‌ర్ చేద్దామ‌నుకొంటారు. కానీ అక్క‌డ్నుంచి త‌ప్పించుకొంటాడు శంక‌ర‌. ఆ త‌ర‌వాత ఏమైంది?  శంక‌ర చేతికి చిక్కిన  ఆ కీల‌క సాక్ష్యం ఏమిటి?  ఈ స్కామ్‌తో సంబంధం ఉన్న పోలీసుల‌కు శంక‌ర ఎలా బుద్ది చెప్పాడు?  ఇదంతా శంక‌ర చూసి తెలుసుకోవాల్సిందే. 

*  విశ్లేష‌ణ‌

త‌మిళంలో మంచి విజ‌యాన్ని అందుకొన్న మౌన గురుకి ఇది రీమేక్‌. మాతృక‌లో ఉన్న‌ది ఉన్న‌ట్టు తీయ‌డానికి ద‌ర్శ‌కుడు ప్ర‌య‌త్నించాడు. త‌న వైపు నుంచి కొన్ని చిన్న చిన్న మార్పులు చేసినా.. అది కొంత వ‌ర‌కే.  క‌థ‌లోకి వెళ్ల‌డానికి ద‌ర్శ‌కుడు చాలా టైమ్ తీసుకొన్నాడ‌నిపిస్తుంది. శంక‌ర ఇమేజ్‌ని పెంచుకొంటూ పోవాల‌ని.. కొన్ని సీన్లు ఎక్కువ‌గా రాసుకొన్నాడు. క్వాయిన్ బాక్స్ ఎపిసోడ్‌,  ఓ పాప‌ని యాక్సిడెంట్ నుంచి కాపాడ‌డం, కాలేజీ యానివ‌ర్స‌డే రోజున ఇచ్చిన స్పీచ్‌.. వ‌గైరా వ‌గైరా అన్న‌మాట‌. ఈ త‌ర‌హా స‌న్నివేశాలన్నీ ఈ సినిమా ఆర్ట్ సినిమా అనే భావ‌న తీసుకొస్తాయి.  ఏసీపీ చేసిన స్కామ్ ద‌గ్గ‌ర నుంచి సినిమా అస‌లు ట్రాక్‌లోకి ఎక్కుతుంది.

అయితే ఆ ఎపిసోడ్ల‌కీ, హీరోకీ సంబంధం లేక‌పోవ‌డంతో... ఆ సీన్లు కూడా కాస్త విసుగు తెప్పిస్తాయి. ఇంట్ర‌వెల్ బ్యాంగ్ స‌మ‌యానికి కూడా స‌మ‌స్యేంటో క‌థానాయ‌కుడికి అర్థం కాదు. అందుకోసం.. ప్రీ క్లైమాక్స్ వ‌ర‌కూ ఆగాల్సివ‌స్తుంది. అయితే... క‌థానాయ‌కుడ్ని ఎందుకు టార్గెట్ చేశారో, అత‌న్నుంచి ఏం ఆశిస్తున్నారో థియేట‌ర్లో కూర్చున్న ఆడియ‌న్‌కి అర్థ‌మైపోతుంది. అందులో పెద్ద ట్విస్ట్ ఏముంద‌ని సెకండాఫ్ మొత్తం చూడాలి??   సినిమా మొత్తం సీరియ‌స్‌గానే న‌డుస్తుంటుంది. ఆ సీరియ‌స్‌నెస్‌కి పాట‌లు అడ్డు ప‌డ‌తాయి. రిలీఫ్ కోసం కామెడీ లేక‌పోవ‌డం, దాని కోసం కొంత ట్రై చేసినా... ఆ ప్ర‌య‌త్నం ఫెయిల్ కావ‌డం.. ఈ సినిమాలోని ప్ర‌ధాన లోపాలు. సిన్సియ‌ర్ ఆఫీస‌ర్‌గా చూపించిన రాజీవ్ క‌న‌కాల.. అంత స‌డ‌న్‌గా ఎందుకు డ‌బ్బుల‌కు క‌క్కుర్తి ప‌డ్డాడు?  మ‌ళ్లీ అంత త్వ‌ర‌గా అత‌నిలో మార్పు ఎలా వ‌చ్చింది? ఇవ‌న్నీ క‌న్వెన్సింగ్‌గా అనిపించ‌వు. విల‌న్ పాత్ర‌లో క్రూర‌త్వం కంటే.. ఓవ‌ర్ యాక్ష‌నే ఎక్కువ‌గా క‌నిపించింది. కిడ్నాప్ డ్రామాతో క్లైమాక్స్  కూడా ప‌ర‌మ రొటీన్ గా సాగింది. 


* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

రోహిత్ ఈ సినిమాతో కొత్త‌గా సాధించేదేం లేదు. న‌టుడిగా ప్ల‌స్‌లు క‌నిపించాల్సిందిపోయి... మైన‌స్‌లే ఎక్కువ‌గా సాక్షాత్క‌రించాయి. ఎప్ప‌టిదో సినిమా కాబ‌ట్టి.. కాస్త యంగ్‌గా, ఇప్ప‌టి కంటే కాస్త స్లిమ్‌గా క‌నిపించాడు.  రెజీనా ఇందులో మ‌రీ పీల‌గా క‌నిపిస్తోంది. ఆమె న‌ట‌న‌కు అంత స్కోప్ ఉన్న పాత్ర కాదు. అయినా స‌రే.. ఉన్నంత‌లో ఓకే అనిపించింది.
అంద‌రికంటే ఎక్కువ మార్కులు పొందే న‌టుడు రాజీవ్‌నే. త‌న‌కు ఇలాంటి పాత్ర‌లు కొట్టిన పిండే. అయితే ఆ క్యారెక్ట‌ర్‌ని తీర్చిదిద్దిన విధాన‌మే కాస్త క‌న్‌ఫ్యూజ‌న్‌గా ఉంటుంది. విల‌న్‌గా భ‌య‌పెట్టాలంటే శాడిజం చూపించాల్సిందేనా?  జాన్ విజ‌య్ పాత్ర అలానే ఉంటుంది. క‌ళ్లు పెద్ద‌వి చేసి మాట్లాడ‌డం మిన‌హా విజ‌య్ న‌ట‌న‌లో కొత్త విష‌యాలేం క‌నిపించ‌లేదు. ఆ స్థానంలో కాస్త తెలిసున్న ఫేస్ క‌నిపిస్తే బాగుండేది. ఈ సినిమా లేట్ అవ్వ‌డం వ‌ల్ల‌.. దివంగ‌త న‌టులు ఎమ్మెస్ నారాయ‌ణ‌, ఆహుతి ప్ర‌సాద్‌ల‌ను మ‌రోసారి చూసే భాగ్యం ద‌క్కింది. 

* సాంకేతిక వ‌ర్గం

సాయికార్తీక్ పాట‌లు గుర్తు పెట్టుకొనేలా లేవు. నేప‌థ్య సంగీతం కూడా అంతంత మాత్ర‌మే. మేకింగ్ ప‌రంగా.. కొత్త గా చూపించిందేం లేదు. వీలైనంత త‌క్కువ‌లో ఈసినిమా చుట్టేద్దామ‌నుకొన్నారు. బ‌డ్జెట్ ప‌రిమితులు స్ప‌ష్టంగా క‌నిపించాయి. మాట‌లు ఆక‌ట్టుకొనేలా లేవు. ద‌ర్శ‌క‌త్వ ప‌రంగా.. తాతినేని స‌త్య త‌న స్టైల్ చూపించ‌లేక‌పోయాడు. ఆల్రెడీ సూప‌ర్ హిట్ క‌థ‌ని కూడా సరిగా హ్యాండిల్ చేయ‌లేక‌పోయాడు.


* చివ‌ర‌గా

మంచి క‌థ దొరికితే స‌రిపోదు. దాన్ని ఆస‌క్తికరంగా తీర్చిదిద్దాలి. అదెలాగో తెలియ‌క‌పోతే.. శంక‌ర‌లాంటి ఫ‌లితాలు వ‌స్తూనే ఉంటాయి. 

రేటింగ్‌: 2

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com