పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోయే చిత్రాల విషయంలో ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముందే ఒప్పుకున్న కొన్ని భారీ ప్రాజెక్టులు తాత్కాలికంగా వాయిదా పడే సూచనలు కనిపిస్తుండటంతో అభిమానుల్లో సరికొత్త ఉత్కంఠ మొదలైంది. అయితే ఓ వైపు నిరాశ ఉన్నా, మరో క్రేజీ సీక్వెల్ తెరపైకి రావడం టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
గతంలో పవన్ కళ్యాణ్, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి కలయికలో ఒక భారీ చిత్రం అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మించాల్సి ఉంది. కానీ సుదీర్ఘ కాలంగా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తికాకపోవడం, కథపై సరైన స్పష్టత రాకపోవడంతో ఈ కాంబినేషన్ ప్రస్తుతానికి హోల్డ్‌లో పడినట్లు ఇండస్ట్రీ టాక్.
ఇదే సమయంలో దర్శకుడు సుజీత్ తెరకెక్కించాల్సిన మరో ప్రాజెక్ట్‌లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. ‘OG’ తర్వాత సుజీత్, నాచురల్ స్టార్ నానితో ‘బ్లడీ రోమియో’ చేయాల్సింది. కానీ నాని ప్రస్తుతం నటిస్తున్న ‘ది పారడైస్’ చిత్రం ఆలస్యం కావడంతో, ఆ గ్యాప్‌ను క్యాష్ చేసుకోవాలని సుజీత్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్‌తో మోస్ట్ అవేటెడ్ మూవీ ‘OG 2’ను త్వరగా పట్టాలెక్కించేందుకు స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు సమాచారం.
ఈ యాక్షన్ సీక్వెల్ ఐడియాపై పవర్ స్టార్ సైతం ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ సినిమాపై ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అలాగే నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, 2027 చివరి నాటికి సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
సురేందర్ రెడ్డితో సినిమా ఆగిపోయిందనే వార్త అభిమానులకు కాస్త షాక్ ఇచ్చినప్పటికీ, ‘OG’ లాంటి విద్వంసకర యాక్షన్ డ్రామాకు సీక్వెల్ రాబోతోందనే అప్‌డేట్ సోషల్ మీడియాలో విపరీతమైన హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌కు కారణమైంది. ‘OG 2’ తర్వాతైనా సురేందర్ రెడ్డి సినిమా ఉంటుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ ఫోకస్ మొత్తం సుజీత్ ప్రాజెక్ట్‌పైనే ఉన్నట్లు ఫిలిం వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.




