Home

»

Latest News

‘NBK 111’ క్రేజీ అప్‌డేట్.. బాలయ్య అభిమానులకు పూనకాలే!

Mar 25, 2026

నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'NBK 111'. 'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది.

తొలి షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్
మార్చి మొదటి వారంలో ప్రారంభమైన ఈ సినిమా తొలి షెడ్యూల్ మార్చి 18 ముగిసింది. ఈ షెడ్యూల్‌లో దర్శకుడు గోపీచంద్ మలినేని అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బాలయ్య మార్క్ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ఫైట్ మాస్టర్ వెంకట్ పర్యవేక్షణలో షూట్ చేశారు. ఈ ఫైట్‌తో పాటు దానికి దారితీసే కీలక సన్నివేశాలు, బాలయ్య పవర్‌ఫుల్ డైలాగ్ వెర్షన్లను కూడా ఈ షెడ్యూల్‌లోనే పూర్తి చేసినట్లు సమాచారం.

బాలయ్య గెటప్‌పై చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీ!
మొదటి షెడ్యూల్ అవుట్‌పుట్ చూసిన తర్వాత చిత్ర యూనిట్ మొత్తం చాలా ఉత్సాహంగా ఉందట. ముఖ్యంగా ఈ సినిమాలో బాలకృష్ణ గెటప్, ఆయన క్యారెక్టరైజేషన్ అనుకున్న దానికంటే చాలా అద్భుతంగా వచ్చాయని టాక్. గ్రే హెయిర్, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో బాలయ్యను చూసి అభిమానులు మురిసిపోవడం ఖాయమని యూనిట్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఆయన చెప్పే డైలాగులు కూడా మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉన్నాయట.

సెకండ్ షెడ్యూల్ ఎక్కడంటే?
ఇక రెండో షెడ్యూల్ ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌ను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్లాన్ చేశారు. పెద్ద హీరోల సినిమాల విషయంలో షూటింగ్ లొకేషన్ల వద్ద అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, చిత్ర యూనిట్ చాలా గోప్యంగా షూటింగ్ నిర్వహించాలని భావిస్తోంది.

గ్యాంగ్‌స్టర్ స్టోరీ.. సరికొత్త షేడ్స్!
NBK 111 కథ గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఇది ఒక పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా అని, మాఫియా నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ కాకుండా సింగిల్ రోల్‌లోనే కనిపిస్తారట. కానీ, ఒకే పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని, 10 ఏళ్ల క్రితం బాలయ్య ఎలా ఉండేవారు.. ఇప్పుడు ఎలా ఉన్నారు అనే టైమ్ లైన్ ఆధారంగా కథ సాగుతుందని సమాచారం.

నటీనటులు - టెక్నీషియన్స్
ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, మరో కీలక పాత్రలో సముద్రఖని కనిపిస్తారని తెలుస్తోంది. సముద్రఖని పాత్ర కేవలం విలన్‌గా మాత్రమే కాకుండా, కథను మలుపు తిప్పే ఒక కీలకమైన పాత్ర అని టాక్. 'వీరసింహారెడ్డి'ని మించిన స్టైలిష్ మేకింగ్‌తో, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

దసరా లక్ష్యంగా బాలయ్య వేట!
అన్నీ అనుకున్నట్టు జరిగితే, ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈలోపు సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో అభిమానుల్లో జోష్ నింపాలని చూస్తున్నారు. నందమూరి అభిమానులు ఈ గ్యాంగ్‌స్టర్ వేట కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి గోపీచంద్ మలినేని ఈసారి బాలయ్యను ఏ రేంజ్‌లో చూపిస్తారో చూడాలి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com