Home

»

Latest News

సినిమా రిలీజ్ ముందు వుండే హడావుడి వెనుక ఉన్న అసలు సీక్రెట్ చెప్పిన నందినీరెడ్డి!

Jun 12, 2026 5:06PM

టాలీవుడ్‌లో ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్లను, హృదయానికి హత్తుకునే కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకురాలు బి.వి. నందినీ రెడ్డికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఆమె టాలెంటెడ్ స్టార్ సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా విడుదల పనులతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ నెల 19న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ తాజా ఇంటర్వ్యూలో నందినీ రెడ్డి పాల్గొని, ఒక సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ అయిన తర్వాత సెట్స్‌లో, ఎడిటింగ్ రూమ్‌లో ఎలాంటి హడావుడి ఉంటుందో ఎంతో ప్రాక్టికల్‌గా వివరించారు.

సినిమా విడుదలకు ముందు చిత్ర యూనిట్ మొత్తం పడే ఆరాటం, టెన్షన్ వెనుక ఒక లాజిక్ ఉందని నందినీ రెడ్డి చెప్పుకొచ్చారు. సాధారణంగా ఏదైనా సినిమాకు రిలీజ్ డేట్ ప్రకటించనంత వరకు పనులన్నీ ఎంతో ప్రశాంతంగా, నెమ్మదిగా సాగుతాయని ఆమె తెలిపారు. కానీ, ఒక్కసారి మేకర్స్ అధికారికంగా థియేట్రికల్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన వెంటనే వాతావరణం మొత్తం ఒక్కసారిగా మారిపోతుందట. అప్పటివరకు రిలాక్స్‌గా ఉన్న టెక్నీషియన్లందరూ ఒక్కసారిగా అలర్ట్ అయిపోయి, తమ బాధ్యతలను పూర్తి చేయడానికి డబుల్ స్పీడ్‌తో శ్రమిస్తారని నందిని వెల్లడించారు.

అయితే ఈ హడావుడి కావాలనే జరుగుతుందా? అనే ప్రశ్నకు కూడా ఆమె ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. చాలామంది సినిమా అవుట్‌పుట్ ముందే రెడీగా ఉంటే టెన్షన్ తప్పుతుంది కదా అనుకుంటారు. కానీ, సినిమా ఫైనల్ కాపీని మరీ ముందుగానే సిద్ధం చేసి పక్కన పెడితే.. చివరి నిమిషంలో క్రియేటివ్‌గా ఏవైనా చిన్న చిన్న మార్పులు లేదా బెటర్మెంట్స్ చేయాలనుకున్నప్పుడు ఆ అవకాశం చేజారిపోతుందని నందినీ రెడ్డి వివరించారు. అందుకే ముఖ్యమైన పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ కావాలనే చివరి దశ వరకు ఉంచి, రిలీజ్ దగ్గరపడే కొద్దీ ఆ ఒత్తిడిని భరిస్తూ బెస్ట్ అవుట్‌పుట్ ఇస్తామని ఆమె క్లారిటీ ఇచ్చారు.

నందినీ రెడ్డి, సమంత కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'ఓ బేబీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరూ కలిసి 'మా ఇంటి బంగారం' చిత్రంతో రాబోతుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా రొటీన్ ఫ్యామిలీ డ్రామా కాదని, రజనీకాంత్ క్లాసిక్ హిట్ 'బాషా' టెంప్లేట్‌ను కాస్త మార్చి.. ఒక అమాయకపు గృహిణి పాత్రకు పవర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్ ఉంటే ఎలా ఉంటుందనే కొత్త కోణంలో ఈ యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్‌ను డిజైన్ చేసినట్లు దర్శకురాలు హింట్ ఇచ్చారు.

ప్రస్తుతం ఈ చిత్రంపై ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి బజ్ నడుస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్‌ను కూడా పూర్తి చేసుకుని 'U/A' సర్టిఫికేట్‌ను సొంతం చేసుకుంది. 2 గంటల 34 నిమిషాల క్రిస్ప్ రన్‌టైమ్‌తో వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా ఆడియన్స్‌ను కట్టిపడేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సమంత హోమ్ బ్యానర్ 'ట్రలాలా మూవింగ్ పిక్చర్స్' నిర్మించిన ఈ చిత్రంలో శ్రీముఖి, గౌతమి, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషించారు. రాబోయే వారంలో థియేటర్లలోకి రానున్న ఈ 'బంగారం' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ రిపీట్ చేస్తుందో చూడాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com