
'బలగం' సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు వేణు యెల్దండి (Venu Yeldandi) తన తదుపరి సినిమా 'ఎల్లమ్మ' (Yellamma) పనుల్లో బిజీగా ఉన్నారు. తెలంగాణ మట్టి వాసనతో కూడిన కథను అద్భుతంగా తెరకెక్కించి ప్రశంసలు అందుకున్న వేణు, ఈసారి కూడా ఒక బలమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాలో కథానాయిక ఎవరనే అంశం ఇప్పుడు పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ సినిమా ప్రారంభం నుండి కథానాయిక పాత్ర కోసం మేకర్స్ పలువురు ప్రముఖ హీరోయిన్లను పరిశీలిస్తూ వచ్చారు. మొదట ఈ పాత్ర కోసం సాయి పల్లవిని అనుకున్నారు. ఆ తర్వాత కీర్తి సురేష్ పేరు కూడా వినిపించింది. యువ కథానాయికలు శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే పేర్లను కూడా చిత్ర బృందం పరిశీలనలోకి తీసుకుంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కథానాయికగా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ఎంపిక దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. 'సీతారామం', 'హాయ్ నాన్న' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మృణాల్ అయితేనే ఈ పాత్రకు పూర్తి న్యాయం చేయగలదని దర్శకుడు భావిస్తున్నారట. ఇన్‌సైడ్ వర్గాల సమాచారం ప్రకారం ఆమెతో చర్చలు ముగిశాయి, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే, ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (DSP) ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. నటనతో పాటు ఈ చిత్రానికి ఆయనే సంగీతాన్ని కూడా అందిస్తుండటం విశేషం. దేవిశ్రీ మార్క్ మ్యూజిక్, వేణు మార్క్ ఎమోషన్స్ కలిస్తే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో అని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.
త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న 'ఎల్లమ్మ' సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక వైపు బలగం వేణు దర్శకత్వం, మరోవైపు హీరోగా డీఎస్పీ.. ఇప్పుడు తోడుగా మృణాల్ ఠాకూర్ కూడా వచ్చి చేరితే ఈ ప్రాజెక్ట్ రేంజ్ మరింత పెరగడం ఖాయం. ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.






