Home

»

Latest News

Mrithyunjay Movie Review : మృత్యుంజయ్ మూవీ రివ్యూ

Mar 05, 2026

తారాగణం: శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్, సుదర్శన్, రచ్చ రవి తదితరులు
సంగీతం: కాలభైరవ
సినిమాటోగ్రఫీ: విద్యాసాగర్
ప్రొడక్షన్ డిజైనర్‌: మనీష్ దత్
ఎడిటింగ్‌: శ్రీకర్ ప్రసాద్
దర్శకత్వం: హుస్సేన్ షా కిరణ్
నిర్మాతలు: సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి
బ్యానర్స్: లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ 
విడుదల తేదీ: మార్చి 6, 2026 

ఇటీవల 'విష్ణు విన్యాసం'తో ప్రేక్షకులను పలకరించిన శ్రీవిష్ణు(Sree Vishnu).. వారం రోజులు తిరగకుండానే మరో సినిమాతో మన ముందుకు వచ్చాడు. అదే 'మృత్యుంజయ్'(Mrithyunjay). ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జానర్ సినిమా కావడంతో పాటు, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో 'మృత్యుంజయ్'పై సినీ లవర్స్ దృష్టి పడింది. మేకర్స్ కూడా కంటెంట్ మీద నమ్మకంతో ప్రీమియర్స్ వేశారు. మరి ఈ 'మృత్యుంజయ్' ఎలా ఉంది? మేకర్స్ నమ్మకాన్ని నిలబెట్టిందా? (Mrithyunjay Movie Review )

కథ:
చిన్న వయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న జై(శ్రీవిష్ణు).. స్వేచ్ఛ అనే దినపత్రికలో మార్కెటింగ్ విభాగంలో పని చేస్తుంటాడు. క్రైమ్ రిపోర్టర్ అవ్వాలనేది గోల్. తాను పని చేసే పేపర్ కి యాడ్స్ తీసుకురావడం కోసం.. ఎక్కడ శవం కనిపిస్తే అక్కడికి వెళ్ళి, ఆ చావు ప్రకటన పేపర్ లో వచ్చేలా చేస్తాడు. ఈ క్రమంలోనే అచ్యుత్ శర్మ(బాలాదిత్య) అనే వ్యక్తి మరణించాడని తెలిసి అక్కడికి వెళ్తాడు. అచ్యుత్ శర్మకు ఒక్కగానొక్క కూతురు ఉంటుంది. ఆ పాపలో జై చిన్నప్పటి తనను చూసుకొని ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాడు. 

మరోవైపు ఆ ప్రాంతానికి కొంతదూరంలో ఇంకో వ్యక్తి కూడా చనిపోతాడు. అతని చావు, అచ్యుత్ శర్మ చావు ఒకేలా ఉండటంతో.. ఇవి సహజ మరణాలు కావని, ఎవరో హత్య చేశారని జైకి అనుమానం వస్తుంది. పోలీసులు సహజ మరణమని కేసు కొట్టేసినా.. జై మాత్రం సొంతంగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. 

చిన్నతనంలో తన తల్లిదండ్రుల చావుకి కారణం ఏంటో తెలుసుకోలేకపోయిన జై.. అచ్యుత్ శర్మ కూతురికి మాత్రం తన పరిస్థితి రాకూడదని, కారణం ఏంటో కనిపెట్టి ఆ పాపకి చెప్పాలని అనుకుంటాడు. తన ఇన్వెస్టిగేషన్ లో జై తెలుసుకున్న షాకింగ్ విషయాలు ఏంటి? అచ్యుత్ శర్మ మరణానికి కారణమేంటి? దీని వెనుక ఉన్నది ఎవరు? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:
సాధారణంగా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాల్లో.. హంతకుడు ఎవరు? అని కనిపెట్టే కోణంలోనే ఎక్కువగా కథ నడుస్తుంది. హంతకుడు ఎవరో కనిపెట్టడానికి హీరో చేసే ప్రయత్నాలు, ఈ క్రమంలో వచ్చే ట్విస్ట్ లు, చివరిలో హంతకుడి ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్.. ఈ తరహాలోనే థ్రిల్లర్ సినిమాలు నడుస్తుంటాయి. కానీ 'మృత్యుంజయ్' సెటప్ మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. 'మృత్యుంజయ్'లో విలన్ ఎవరు అనేది హీరోకి ఆలస్యంగా తెలుస్తుంది కానీ, చూసే ప్రేక్షకులకు మాత్రం ముందే తెలుస్తుంది. 

రోజుల వ్యవధిలో ఒకే తరహాలో ఇద్దరు చనిపోతారు. అవి సహజ మరణాలు కావు, వాటి వెనుక హంతకుడు ఉన్నాడని హీరో తప్ప ఎవరూ నమ్మరు. దీంతో హీరో ఒక్కడే ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. క్రైమ్ రిపోర్టర్ కావాలనేది హీరో డ్రీమ్ కాబట్టి, అతను ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది కథలో సహజంగానే ఇమిడిపోయింది.

ఇక తన ముసుగు తీయడానికి ఒక వ్యక్తి ప్రయత్నిస్తున్నాడని విలన్ కి కూడా ముందే తెలుస్తుంది. ఓ వైపు తెలియని హంతకుడిని కనిపెట్టాలని హీరో ప్రయత్నిస్తుంటే, మరోవైపు తనను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న హీరోని చంపేయాలని విలన్ అనుకుంటాడు. దీంతో సినిమా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది.

ఈ సినిమాకి రన్ టైమ్ బాగా ప్లస్ అయింది. కేవలం రెండు గంటల నిడివితో తెరకెక్కింది. థ్రిల్లర్ సినిమాలను తక్కువ నిడివితో ఎంగేజింగ్ గా చెప్పాలనే సూత్రాన్ని దర్శకుడు పాటించాడు. అనవసరమైన కామెడీ ట్రాక్స్, సాంగ్స్ ని ఇరికించే ప్రయత్నం చేయకుండా.. జానర్ కి తగ్గట్టుగా తాను అనుకున్న కథకు స్టిక్ అయ్యాడు.

పేపర్ లో యాడ్స్ కోసం చావుల చుట్టూ హీరో తిరిగే సన్నివేశాలతో సినిమా ప్రారంభమైంది. అసలు కథలోకి వెళ్ళడానికి దర్శకుడు పెద్దగా సమయం తీసుకోలేదు. రెండు చావులు ఒకేలా ఉండటంతో హీరో ఇన్వెస్టిగేషన్ చేయడం, ఈ క్రమంలో విలన్ ఎవరు అనేది ఆడియన్స్ కి రివీల్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ మెప్పించింది. 

సెకండ్ హాఫ్ లో షాడో లాంటి విలన్ కోసం హీరో వెతకడం, తనను వెతుకున్న హీరోకి చెక్ పెట్టాలని విలన్ అనుకోవడంతో కథనం ఆసక్తికరంగా నడిచింది. అయితే సెకండాఫ్ హీరో కంటే, విలన్ కోణంలో ఎక్కువ నడవడం కాస్త మైనస్ అనిపిస్తుంది.

అలాగే ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలను, హీరో-విలన్ మధ్య ఎత్తుకు పైఎత్తు వేసే మైండ్ గేమ్ సీన్స్, పతాక సన్నివేశాలను కూడా మరింత ఎఫెక్టివ్ గా రాసుకొని ఉండాల్సింది. డిఫరెంట్ సెటప్ కి తగ్గట్టుగా రైటింగ్ ఇంకా మెరుగ్గా ఉంటే.. అవుట్ పుట్ మరోస్థాయిలో ఉండేది.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
ఈ సినిమాలో శ్రీవిష్ణు వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. థ్రిల్లర్ జానర్ కి తగ్గట్టుగా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో సినిమాని నిలబెట్టాడు. సీత అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో రెబా మోనికా జాన్ కనిపించింది. కథ పరంగా పాత్రకు పెద్ద ప్రాధాన్యం లేకపోయినా.. ఉన్నంతలో మెప్పించింది. విలన్ నటన ఆకట్టుకుంది. సుదర్శన్, రచ్చ రవి అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు.

సాంకేతికంగా సినిమా బాగానే ఉంది. కాలభైరవ సంగీతం సినిమాకి ప్లస్ అయింది. స్టోరీ మూడ్ కి తగ్గట్టుగా విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ షార్ప్ గానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం ఇంకా బెటర్ గా ఉండాల్సింది. 

ప్లస్ పాయింట్స్:
కథాంశం
శ్రీవిష్ణు నటన
కాలభైరవ సంగీతం
నిడివి

మైనస్ పాయింట్స్:
పోలీస్(హీరోయిన్) ట్రాక్ 
హీరో-విలన్ మధ్య కొన్ని సీన్స్
ప్రొడక్షన్ వాల్యూస్

ఫైనల్ గా..
'మృత్యుంజయ్'.. శ్రీవిష్ణుకి ఇది కొత్త ప్రయత్నం.. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వారికి నచ్చుతుంది.

రేటింగ్: 2.75/5

Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com