
టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి మౌనీ రాయ్ (Mouni Roy) తాజాగా ముంబైలో ఎదుర్కొన్న ఒక చేదు అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 'నాగిని' సిరీస్‌తో విశేష ప్రజాదరణ పొందిన ఈ అందాల భామ, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' (Vishwambhara) సినిమాలో ఒక కీలక పాత్రతో పాటు స్పెషల్ సాంగ్‌లో నటిస్తూ బిజీగా ఉంది.
సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను నిరంతరం కెమెరాల్లో బంధించే పాపారాజీల (ఫొటోగ్రాఫర్ల) అత్యుత్సాహం ఒక్కోసారి హద్దులు దాటుతుందనడానికి తాజాగా మౌనీ రాయ్ విషయంలో జరిగిన ఘటనే నిదర్శనం. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఆమె ఫొటోగ్రాఫర్లపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ వివాదానికి దారితీసిన అసలు కథ ముంబైలోని ఒక ప్రముఖ రెస్టారెంట్ దగ్గర మొదలైంది. మౌనీ రాయ్ తన ఫ్రెండ్, నటి అనుషా దండేకర్‌తో కలిసి డిన్నర్ కోసం వెళ్ళింది. డిన్నర్ ముగించుకుని వారు బయటకు రాగానే, పాపారాజీలు ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టారు. కెమెరా ఫ్లాష్ లైట్లతో ఆమెను ఫొటోలు తీయడం ప్రారంభించారు. సెలబ్రిటీగా అలవాటైన విషయమే అయినా, ఆ తర్వాత వారు ప్రవర్తించిన తీరు ఆమెకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది. మౌనీ రాయ్, అనుషా దండేకర్ ఇద్దరూ తమ కారులోకి వెళ్లి కూర్చున్న తర్వాత కూడా, ఫొటోగ్రాఫర్లు వదలకుండా కారు విండో గ్లాసెస్ నుండి లోపలికి కెమెరాలు పెట్టి ఫొటోలు, వీడియోలు తీస్తూనే ఉన్నారు.
కారు లోపల కూడా కనీస ప్రైవసీ లేకుండా ప్రవర్తించడంతో మౌనీ రాయ్ తీవ్ర ఆగ్రహానికి గురైంది. సహనం కోల్పోయిన ఆమె కారు విండో లోంచి వేలు చూపిస్తూ, చాలా సీరియస్ లుక్‌తో 'బంద్ కరో' (కెమెరాలు ఆపండి) అంటూ గట్టిగా హెచ్చరించింది. పరిస్థితి చేయి దాటిపోతోందని గమనించిన ఆమె స్నేహితురాలు అనుషా దండేకర్ వెంటనే జోక్యం చేసుకుంది. ఒకవైపు మౌనీని శాంతింపజేస్తూనే, మరోవైపు కారు బయట ఉన్న ఫొటోగ్రాఫర్లకు ఇక కెమెరాలు ఆపేయాలని, తమను వెళ్ళనివ్వాలని విజ్ఞప్తి చేసింది. ఆ తర్వాత కారు అక్కడి నుండి వెళ్ళిపోయింది. కానీ, ఈ విజువల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయ్యాయి.
ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికే మౌనీ రాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. అందులో ఆమె స్పష్టంగా.. "దయచేసి ఇకపై నన్ను ఎప్పుడూ ఫొటోలు తీయకండి. చాలా కాలంగా నేను మిమ్మల్ని ఎప్పుడూ నా కోసం రమ్మని పిలవలేదు. మీ అందరిపై నాకు ప్రేమ, గౌరవం ఉన్నాయి, కానీ నేను మిమ్మల్ని పిలవను. కాబట్టి నా కోసం రావద్దు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా నా ఫొటోలు మీడియాలో బయటకు వస్తే, వాటికోసం నేనే పిలిచానని మాత్రం అనుకోకండి. దయచేసి నన్ను ఫొటోలు తీయడం పూర్తిగా ఆపేయండి. ప్లీజ్... ఇక చాలు." అని రాసుకొచ్చింది.
అయితే ఈ పోస్ట్ పెట్టిన 15 నుండి 20 నిమిషాల వ్యవధిలోనే మౌనీ రాయ్ దానిని ఇన్‌స్టాగ్రామ్ నుండి డిలీట్ చేసింది. ఆమె ఎందుకు డిలీట్ చేసిందనేది సస్పెన్స్‌గా మారినప్పటికీ, అప్పటికే కొందరు నెటిజన్లు ఆ స్టోరీని స్క్రీన్‌షాట్‌లు తీసి వైరల్ చేసేశారు.
ఈ మొత్తం వ్యవహారంపై నెటిజన్లు ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు మౌనీ రాయ్ అంతలా రియాక్ట్ అవ్వడం అనవసరమని విమర్శిస్తుండగా, మెజారిటీ నెటిజన్లు మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. సెలబ్రిటీలకైనా కనీస ప్రైవసీ ఉంటుందని, కారు లోపలికి కెమెరాలు పెట్టి వేధించడం తప్పు అని ఫొటోగ్రాఫర్ల తీరును తప్పుబడుతున్నారు.
Mouni Roy, Paparazzi, Vishwambhara Movie, Chiranjeevi




